ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రభుత్వాన్ని మార్చారు. మరి ప్రజలు కోరుకున్న మార్పును కాంగ్రెస్‌ చూపిస్తుందా? అనేది ఇప్పుడు అతిపెద్ద సవాలుగా నిలిచింది

- గులాబీ నేతల మాటల్లోనే ధనిక రాష్ట్రం.. వాస్తవంలో లక్షల కోట్ల అప్పుల కుప్ప

- అప్పులు తీర్చాలి.. కొత్త హామీలు నెరవేర్చాలి..

- ప్రజలు కోరుకున్న మార్పును కాంగ్రెస్‌ తెస్తుందా?

- దశలవారీగానే గ్యారెంటీలు, మ్యానిఫెస్టో హామీలు!

- ప్రజలను మానసికంగా సిద్ధం చేసే యత్నాలు

- అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల?


విధాత ప్రత్యేకం: ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రభుత్వాన్ని మార్చారు. మరి ప్రజలు కోరుకున్న మార్పును కాంగ్రెస్‌ చూపిస్తుందా? అనేది ఇప్పుడు అతిపెద్ద సవాలుగా నిలిచింది. ప్రత్యేకించి గత బీఆరెస్‌ ప్రభుత్వం ఎడాపెడా చేసిన అప్పులు కొత్త సర్కారు నెత్తిన భారీగా నిలిచాయి. వాటికి సర్దుబాటు చేయడంతోపాటు.. తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, మ్యానిఫెస్టోలని ఇతర అంశాల అమలును కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలా సమన్వయం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ముందుంది ముసుర్ల పండుగ అన్నట్టు కొత్త ప్రభుత్వం పాలనకు గత ప్రభుత్వం చేసిన అప్పులు గట్టి సవాలు విసిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర అప్పులు ఐదున్నర లక్షల కోట్ల వరకూ ఉన్నాయి.


కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ఏటా లక్ష కోట్లకు పైగా అదనంగా ఖర్చు అవువుతుందనే అంచనాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు నాటికి ధనిక రాష్ట్రంగా, మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా ఉన్నప్పటికీ.. పదేళ్ల వ్యవధిలో బీఆరెస్‌ ప్రభుత్వ చర్యలతో ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో బడ్జెటేతర రుణాలతోపాటు ప్రభుత్వం 76 వేల కోట్ల అప్పుల్లో ఉండగా పదేళ్లలో బీఆరెస్‌ ప్రభుత్వం చేసిన 5.3 లక్షల కోట్ల అప్పులు తోడయ్యాయి. నేరుగా తీసుకున్న అప్పులే 3.59 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక వివిధ కార్పొరేషన్లు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు 1.29 లక్షల కోట్ల వరకు ఉన్నాయి.


కాంగ్రెస్‌ చిత్తుపద్దు ఇదీ!

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి ఏటా 3,000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఇక ఆరోగ్యశ్రీ రీయింబర్స్‌మెంట్‌ ఏటా వేల కోట్లలో ఉండనుంది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సరేసరి. మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద మహిళలకు 2500 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాదాపు 20 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉంటారని అంచనా. దీనికి ఏటా 6 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామని చేసిన ప్రకటనతో ఏడాదికి 1.8 లక్షల మందికి ప్రభుత్వం 3 వేల కోట్ల సబ్సిడీ చెల్లించాల్సి ఉంటుంది.


గ్యాస్ ధర పెరిగితే దాని ప్రకారం ఆర్థిక భారం కూడా పెరగనుంది. రైతు భరోసా పథకం కింద ఏడాదికి 30 వేల కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఇందులో 25 లక్షల మంది రైతుల రైతు కూలీలకు ఏడాదికి 3000 కోట్లు, 69 లక్షల మంది రైతులకు ఎకరాకు 15 వేలకు 22 వేల 600 కోట్లు, 6 లక్షల మంది కౌలు రైతులకు 3000 కోట్ల వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల సహాయం అందిస్తామని, అమరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లు కడతారని అంచనా వేస్తే అందుకు 17 వేల కోట్లు అవసరం. యువ వికాసానికి రెండు లక్షల మంది విద్యార్థులకు చొప్పున అంచనా వేసినా పదివేల కోట్లు ఖర్చు అవుతాయి. 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్తు కోసం 3500 కోట్లు సబ్సిడీ గా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.


విద్యుత్తు సంస్థల అప్పుల షాక్‌

తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు 85 వేల 500 కోట్లుగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు 22,432 కోట్లు అప్పులు మాత్రమే విద్యుత్తు సంస్థలకు ఉన్నాయి. ప్రస్తుతం కరెంటు కొనుగోలుకు చేసిన అప్పులే 30,480 కోట్లు. దీనిపై నెలకు 1000 కోట్ల వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల నష్టాలు ఏకంగా రూ.50,275 వేల కోట్లు పైగా పెరిగాయి. విద్యుత్తు శాఖకు కరెంట్ బిల్లుల రూపంలో 20,800 కోట్లు మాత్రమే అదాయం వస్తుందని అంచనా. రానున్న అర్ధ సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల మధ్య 11 వేల కోట్ల మేరకు తేడా ఉన్నది. ప్రభుత్వం విద్యుత్తు సంస్థలకు 28,140 వేల కోట్ల బాకీ పడింది.


మరో 12,515 కోట్ల ట్రూ అప్ చార్జీలు సైతం రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది. ఆ రెండింటినీ కలిపితే డిస్కంలకు ప్రభుత్వం 40,650 కోట్ల బకాయిలు పడింది. కాళేశ్వరంతోపాటు రాష్ట్రంలోని ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం వాడిన కరెంటు బిల్లుల బకాయిలు 14,172 కోట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఎత్తిపోతల పథకాల కరెంటు బకాయిలు 103 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇక మిషన్ భగీరథ అమలుకు వాడిన కరెంటు బకాయిలు 3559 కోట్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు జలమండలి బకాయిలు 3932 కోట్లుగా ఉన్నాయి. అంతా కలిపి ప్రభుత్వపరంగా విద్యుత్తు సంస్థలకు 28,861 కోట్ల బకాయిలు ఉన్నాయని తాజాగా విద్యుత్తు శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదించింది. అలాగని విద్యుత్తు బిల్లులు పెంచిన పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్తు బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి.


ఇక హామీలలోకి వస్తే..

చేయూత కింద 4000 పెన్షన్‌కు ఏటా 21 వేల కోట్ల భారం పడనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి మరింత గుదిబండగా మారనుంది. ప్రాజెక్టు కోసం కార్పొరేషన్ల వద్ద 85265 కోట్ల రుణాలు తీసుకున్నారు. కాగ్ లెక్కల మేరకే కాళేశ్వరం పూర్తిస్థాయిలో నడిస్తే విద్యుత్తు బిల్లులు ప్రతినెల 11359 కోట్లు అవుతాయి. ప్రాజెక్టు నిర్వహణకు ఏడాదికి 273 కోట్లు కావాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు రుణాల చెల్లింపులు ఏటా 13,500 కోట్లు. ప్రభుత్వం ఏటా కాళేశ్వరానికి 25,109 కోట్ల భారం మోయాల్సి ఉండగా అందులో నెలకు 2100 కోట్లు అవసరం. ఇంతగా ఖర్చుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఆదాయం ఆశించలేని పరిస్థితి. మిషన్ భగీరథ కోసం అప్పు 24,364 కోట్లు తీసుకున్నారు.


ఆయా కార్పొరేషన్ ఆప్పులపై 10 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది. మొత్తంగా వడ్డీలకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా 1700 కోట్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా. సగటున రాష్ట్ర ఆదాయం 10,000 కోట్లుగా ఉంటే ఖర్చు ప్రతి నెలా 13 వేల కోట్లుగా కనిపిస్తున్నది. తెలంగాణలో ఉద్యోగులకు 3,115 కోట్లు.. పెన్షనర్లకు చెల్లించేందుకు 1450 కోట్లు ప్రతినెల అవసరం. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ మేరకు చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో ద్వారా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సవాల్ గానే ఉంటుంది.. ఆర్టీసీ నష్టాలను అధిగమించాల్సి ఉన్నది. జీహెచ్‌ఎంసీ, జలమండలి, రోడ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ సహా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం, జీతాలు, పెన్షన్లు, కొత్త పథకాలు, పాత వాటి కొనసాగింపునకు బడ్జెట్ చాలని పరిస్థితిని కాంగ్రెస్‌ సర్కారు ఎదుర్కొనాల్సి ఉన్నది.

వడ్డీల కోసం అప్పులు

వడ్డీల కోసమే కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ఖజానాకు ఎదురవుతున్నది. ఇలాంటి తరుణంలో ఆరు గ్యారెంటీలతోపాటు.. మ్యానిఫెస్టో హామీలు కాంగ్రెస్‌కు తలకు మించిన భారంగా పరిణమించనున్నాయి. బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఆదాయాన్ని, అప్పులను కాంగ్రెస్‌ సర్కారు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అందకు మద్యం, భూముల అమ్మకాలు వంటి వాటితో కాకుండా ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, ప్రణాళికాయుత ప్రగతి సాధించాల్సి ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నది. అంతకుముందు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది.

దశలవారీగానే హామీల అమలు

ఇచ్చిన హామీలను వెంటవెంటనే నెరవేర్చడానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించే వాతావరణం కనిపించడం లేదు. గత ప్రభుత్వం పెద్ద మొత్తంలో చేసిన అప్పులే కొత్త సర్కారుకు గుదిబండలవుతున్నాయి. ఈ పరిస్థితిని ప్రజలకు వివరించి, దశలవారీగానే హామీల అమలు ఉంటుందని ప్రజలను ఒప్పించేందుకు, వారిని మానసికంగా సిద్ధం చేసేందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలను కాంగ్రెస్‌ ఎంచుకున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఖజానా ఖాళీ

ఇప్పటికిప్పుడు రైతు భరోసాకు 11,000 కోట్లు అవసరమని అంచనా. అందులో 30% నిధులు కూడా ప్రస్తుతం ఖజానాలో లేవని అధికారులు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజు, ప్రభుత్వ భూముల అమ్మకంతో వచ్చిన డబ్బులు 19 వేల కోట్ల వరకు గత సర్కార్ ఖర్చు చేసేసింది. మద్యం టెండర్లను కూడా ముందే పూర్తి చేసి, తద్వారా వచ్చిన రాబడిని కూడా గత ప్రభుత్వమే ఖర్చు చేసింది. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన అప్పులన్నీ మరో నాలుగు నెలలు మిగిలి ఉండగానే వాటినీ వాడేసింది. కొత్త ప్రభుత్వం ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకునే చాన్స్‌ లేకుండా చేసింది. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నూతన మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆర్థిక వేత్తలు అంటున్నారు.

నాలుగు నెలల్లో లక్ష కోట్లు రావాలి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి మొత్తం రెవిన్యూ 2.16 లక్షల కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటికే లక్ష 15 వేల కోట్లు వచ్చాయి. ఇంకా మిగిలిన నాలుగు నెలల్లో లక్ష కోట్ల రూపాయలు రావాలి. ఆదాయం కూడా ఎన్నికల నేపథ్యంలో తగ్గిపోయింది. ప్రధానంగా ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, జీఎస్టీ, లిక్కర్ ద్వారా ఆదాయం సమకూరుతుంది. 2,300 కోట్ల ఆదాయం ప్రతినెల లిక్కర్ సేల్స్ ద్వారా వస్తుందని అంచనా. లిక్కర్ టార్గెట్స్ మేరకు మూడు వేల కోట్లకు పైగా రావాల్సి ఉంది. స్టాంప్స్ అండ్ డ్యూటీ రిజిస్ట్రేషన్ నవంబర్ నెల కొరకు 12 వేల కోట్లు రావాల్సి ఉండగా అది కూడా 9500 కోట్లు మాత్రమే వచ్చింది. జీఎస్టీ 51 వేల కోట్ల లక్ష్యానికి గాను నవంబర్ నాటికి 30 వేల కోట్లలోపే వచ్చింది. మార్చి చివరకు మరో 20 వేల కోట్లు రావాల్సి ఉంది.

Updated On 11 Dec 2023 4:44 PM GMT
Subbu

Subbu

Next Story