ఓడిపోతామని ముందే తెలుసు: కేసీఆర్‌

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌, పెద్దపల్లి

ఓడిపోతామని ముందే తెలుసు: కేసీఆర్‌
  • 15 రోజుల ముందే సంకేతాలు
  • అభ్యర్థులను మార్చే టైమ్‌ లేదు
  • అందుకే అలాగే ఎన్నికలకు వెళ్లాం
  • లోక్‌సభ పోరు బీజేపీ, బీఆరెస్ మధ్యే
  • 12న కరీంనగర్‌లో బహిరంగ సభ
  • మూడు మార్గాల్లో బస్సు యాత్రలు
  • లోక్‌సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు

విధాత, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడిన ఆయన.. పార్టీ శ్రేణులకు పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటమి తప్పదని తనకు 15 రోజుల ముందే సంకేతాలు ఉన్నాయని వ్యాఖ్యానించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సిటింగ్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలుసని, అయితే అంత తక్కువ వ్యవధిలో అభ్యర్థులను మార్చే పరిస్థితి లేక.. వారితోనే ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన చెప్పారని సమాచారం. అందుకే ఓడిపోయామని వ్యాఖ్యానించారని తెలిసింది. 1984 ఎన్నికల్లో టీడీపీ అధినేత ఎన్టీఆర్‌తో ఆ ఎన్నికల్లో మనం ఓడిపోతామని ముందే చెప్పి మంచిపేరు తెచ్చుకున్నానంటూ ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి, బీఆరెస్‌కు మధ్యనే ప్రధాన పోటీ సాగుతుందని కేసీఆర్‌ అన్నారని సమాచారం. బీఆరెస్ నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బీ వినోద్‌కుమార్‌ను, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను కేసీఆర్ ప్రకటించారని ప్రచారం జరుగుతున్నది.

కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత

అతి కొద్ది రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణలో రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చిందని, బీఆరెస్‌ పార్టీతోనే మేలు జరుగుతుందని ప్రజల్లో టాక్ మొదలైందని అన్నారని తెలిసింది. శాసనసభ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని శ్రేణులకు సూచించారని, నేతలు, కార్యకర్తలు అధైర్యపడొద్దని చెప్పారని సమాచారం. నేతలంతా కలిసి పని చేయాలని, కష్టపడి పనిచేస్తే గుర్తింపు అదే వస్తుందన్నారు.

12న కరీంనగర్‌లో బహిరంగసభ

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్‌ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంంలో బహిరంగ సభల కంటే బస్సు యాత్రలతో రోడ్‌షోలు నిర్వహించడంతోనే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. మూడు మార్గాల్లో బస్సు యాత్రలను ప్రారంభించి అన్ని పార్లమెంటు నియోజకవర్గాలను టచ్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. రోడ్‌షోలు నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. రోడ్ షోలలో తాను స్వయంగా పాల్గొనున్నట్లు తెలిపారు. మండల స్థాయిలోనూ పార్టీ సమావేశాలు పెట్టాలని నేతలకు సూచించారు.