ప్రతిపక్షాల గొంతు నొక్కారు: హరీశ్‌రావు
రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కిందని, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని మాజీ మంత్రి టీ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు

- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
- నిరసనకు అవకాశమివ్వని సర్కార్
- మీడియా పాయింట్‌లో హరీశ్‌రావు
విధాత, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కిందని, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని మాజీ మంత్రి టీ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. ఎంఐఎం, బీజేపీలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం భయపడిందని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి, బీఆరెస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్, అబద్ధాలను సభలో చెప్పారని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగినా తమకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.
మూడు నిమిషాల్లో మూడు సార్లు మైక్ కట్ చేశారన్నారు. తమ తప్పులు బయటపెడతామని ప్రభుత్వమే పారిపోయిందన్నారు. విదేశీయురాలు సోనియాగాంధీని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలుగా చేశారని, దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టిన తెలంగాణ బిడ్డ పివి.నరసింహారావును అవమానించారని అన్నారు. అంజయ్యను మాజీ ప్రదాని రాజీవ్ గాంధీ అవమానించారని గుర్తు చేశారు. బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం అమరవీరులను స్మరించుకున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని, ఉద్యమంలో రైఫిల్ పట్టుకుని రేవంత్ రెడ్డి తిరగలేదా? అని ప్రశ్నించారు.
ఈ రోజుకూ తమ మీద తెలంగాణ ఉద్యమ కేసులు ఉన్నాయని, అనేక ఉద్యమకారుల కేసులను బీఆరెస్ ప్రభుత్వం మాఫీ చేసిందని గుర్తు చేశారు. తమకు క్లారిఫికేషన్ ఇచ్చేందుకు సభలో మైక్ ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వరి ధాన్యం 24 లక్షల మెట్రిక్ టన్నులు అయితే బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు కోటీ 20 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్పారు. మిరప పంటలో తెలంగాణ మొదటి స్థానంలో, ప్రత్తి పంటలో దేశంలో రెండవ స్థానంలో వుందని, రైతు ఆత్మహత్యలు తగ్గాయని హరీష్ అన్నారు.