Ration Cards | రేషన్ కార్డులపై కీలక అప్డేట్..! కొత్త పేర్ల నమోదు త్వరలోనే..!! వివరాలివే..
Ration Cards | రేషన్ కార్డు(Ration Cards )లపై కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) కీలక అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే రేషన్ కార్డుల్లో కొత్త పేర్ల నమోదుకు అవకాశం కల్పిస్తామని పౌరసరఫరా శాఖ( Civil Supplies ) అధికారులు పేర్కొన్నారు.

Ration Cards | తెలంగాణ(Telangana)లోని లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డు( Ration Cards )ల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Govt ) పదేండ్ల కాలంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు. కొత్త రేషన్ కార్డులను రేపోమాపో జారీ చేస్తామన్న ప్రకటనలకే బీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితమై పోయింది. పదేండ్ల పాటు ఇదే ప్రకటనలు. కానీ అర్హులైన లబ్దిదారులకు మాత్రం కొత్త రేషన్ కార్డులు జారీ చేయనేలేదు. కొత్త రేషన్ కార్డుల కోసం డిమాండ్లు వచ్చినప్పటికీ కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
కొత్త పేర్ల నమోదుకు కాంగ్రెస్ సర్కార్ సానుకూలం
ఇక మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కూడా ఎనిమిది నెలల పాటు కొత్త రేషన్ కార్డుల జారీపై కాలయాపన చేసింది. కానీ ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక భార్యాపిల్లల పేర్ల నమోదుకు త్వరలోనే అవకాశం కల్పించనున్నట్లు పౌరసరఫరాల శాఖ( Civil Supplies ) అధికారులు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల్లో( Ration Cards ) అర్హులైన కొత్త కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు( Family Digital Card )ల అంశం కొలిక్కి రాగానే కొత్త పేర్ల నమోదుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు.
పెండింగ్‌లో 11.08 లక్షల దరఖాస్తులు
అర్హుల పేర్లు చేర్చాలని ఇప్పటికే మీసేవా( Mee Seva ) కేంద్రాల ద్వారా 11.08 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో సివిల్ సప్లయిస్ అధికారులు ఇప్పటి వరకు ఆ దరఖాస్తులను పరిశీలించలేదు. త్వరలోనే ఈ దరఖాస్తులను పరిశీలించి, నెలకు ఎన్ని టన్నుల బియ్యం అదనంగా కావాల్సి ఉంటుందనే నిర్ధారించనున్నారు. అయితే దరఖాస్తుల ప్రకారం.. నెలకు ప్రభుత్వంపై రూ. 37.40 కోట్ల అదనపు భారం పడనున్నట్లు తెలుస్తోంది.
ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వచ్చాకే..
మొదట ఫ్యామిలీ డిజిటల్ కార్డులు( Family Digital Cards ) వచ్చాక.. ప్రస్తుత రేషన్ కార్డులు( Ration Cards ), అందులోని లబ్దిదారుల సమాచారం అంతా చేరిపోయేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో రేషన్ షాపునకు వెళ్లి అక్కడ క్యూఆర్ కోడ్( QR Code ) స్కాన్ చేస్తే ఆ ఫ్యామిలీకి ఏ సరుకులకు, ఎంత పరిమాణానికి అర్హత ఉందన్న వివరాలు తెలిసిపోతాయి. ఆ మేరకు రేషన్ అందుకోవాల్సి ఉంటుంది.
కొత్తగా పెళ్లైన దంపతులు, వారి పిల్లల పేర్లు నమోదు చేసుకోవడం ఎలా..?
కొత్తగా పెళ్లైన దంపతులు( Married Couple ) కొత్త రేషన్ కార్డు ఎందుకు తీసుకోవాలి..? తల్లిదండ్రులకు సంబంధించిన రేషన్ కార్డులోనే కోడలి( Daughter in Law ) పేరు చేర్చితే సరిపోతుంది కదా అనే సందేహం రావొచ్చు. కానీ కాంగ్రెస్ సర్కార్( Congress Govt ) ప్రతి ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డును ప్రామాణికం చేసింది. అర్హులైన పేదలు ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డును కలిగి ఉండాల్సిందే. కాబట్టి కొత్తగా పెళ్లైన దంపతులు, వారి పిల్లలు ఈ పద్ధతిని అనుసరించి కొత్త రేషన్ కార్డును పొందొచ్చు.
మరి కొత్త రేషన్ కార్డు పొందడం ఎలా..?
1. మొదటగా పెళ్లైన యువకుడు తన తల్లిదండ్రుల రేషన్ కార్డులో నుంచి తన పేరును తొలగించుకోవాలి. ఇందుకు మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. తమ వెంట రేషన్ కార్డు తీసుకెళ్లాలి. తహసీల్దార్ ఆఫీసులో ఉండే కంప్యూటర్ ఆపరేటర్‌కు చెప్పి.. తల్లిదండ్రుల రేషన్ కార్డులో నుంచి పేరును తొలగించుకోవాలి.
2. ఆ తర్వాత తన భార్య పేరును కూడా వారి తల్లిదండ్రుల రేషన్ కార్డులో నుంచి తొలగించాలి. సదరు మహిళ ఏ మండల పరిధిలోకి వస్తే ఆ మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసులోనే ఈ ప్రక్రియను పూర్తి చేయించాలి.
3. ఇక అటు భర్త, ఇటు భార్య పేర్లు తమ తమ కుటుంబ సభ్యుల రేషన్ కార్డుల నుంచి తొలగించబడ్డాయో లేదో నిర్ధారించుకోవాలి. ఇద్దరి పేర్లు తొలగిపోయాయని నిర్ధారణ అయితే.. తహసీల్దార్ కార్యాలయాల వద్ద లభించే రేషన్ కార్డు దరఖాస్తులను తీసుకోని, వాటిని తప్పుల్లేకుండా నింపాలి.
కొత్త రేషన్ కార్డులకు ఏయే డాక్యుమెంట్స్ అవసరం..?
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు నింపిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఆ దరఖాస్తుకు జతపరచాలి. అవి ఏంటంటే.. భార్యాభర్తల ఆధార్ కార్డులు, పుట్టిన తేదీ ధృవీకరణ కోసం స్టడీ సర్టిఫికెట్, తమ పేర్లు కలిగిన ఉన్న పాత రేషన్ కార్డులు, మ్యారేజ్ సర్టిఫికెట్( Marriage Certificate )తో పాటు ఇద్దరి ఫొటోలను జతపరిచి, మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలి.
అధికారులు తమ దరఖాస్తును పరిశీలించి, అన్ని సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత తమకు కొత్త రేషన్ కార్డును జారీ చేస్తారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వారైతే.. తహసీల్దార్ కార్యాలయాలను కాకుండా జోనల్ సర్కిల్ ఆఫీసులను సంప్రదించి, తమ పేర్లను తొలగించుకోవాల్సి ఉంటుంది.