ఇల్లందులో బీఆరెస్ కు దెబ్బ మీద దెబ్బ

ఇల్లందులో బీఆరెస్ కు దెబ్బ మీద దెబ్బ
  • మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ కాంగ్రెస్ లో చేరిక
  • అదే బాటలో మరో ముగ్గురు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు
  • మాజీ మంత్రి తుమ్మల సమక్షంలో చేరిక
  • బీఆర్ఎస్ కు భారీగా గండి
  • ఎంపీపీ దంపతులకు బెదిరింపులు
  • ప్రాణహాని ఉందన్న చీమల నాగరత్నమ్మ


విధాత, ఇల్లందు: ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. బుధవారం గార్ల మండలానికి చెందిన కీలక బీఆరెస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి, శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మూకుమ్మడిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరికొంత మంది బీఆరెస్ నాయకులు కాంగ్రెస్ బాట పట్టారు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, మరో ముగ్గురు కౌన్సిలర్లు, ఎంపీపీ కాంగ్రెస్ కు జై కొట్టారు. మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


వరుసగా సాగుతున్న వలసల పర్వంతో ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పని ఖేల్ కతం.. దుకాణం బంద్ గా మారిందన్న చర్చ స్థానికంగా జరుగుతోంది. ఈ పరిణామంతో గులాబీ పార్టీకి భారీగా గండిపడుతోంది. ఒక్కొక్క మండల నుంచి స్థానిక ప్రజాప్రతినిలంతా కారు దిగుతున్నారు. హస్తం వైపు పరుగులు పెడుతున్నారు. ఎమ్మెల్యే దంపతుల పనితీరు నచ్చకనే పార్టీని వీడుతున్నట్లు మీడియా ఎదుట స్థానిక ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.


ఆగని బెదిరింపులు


పార్టీ మారుతున్న స్థానిక బీఆరెస్ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే దంపతుల నుండి బెదిరింపులు వస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇల్లందు మండల ఎంపీపీ చీమల నాగరత్నం మాట్లాడుతూ తనకు, తన భర్తకు ఎమ్మెల్యే దంపతుల నుండి ప్రాణహాని ఉందంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయం మేరకే పార్టీ మారుతున్నామని, బలవంతంగా బెదిరింపులు ఏంటని ప్రశ్నించారు.


కొనసాగుతున్న చేరికల పరంపర


కాంగ్రెస్ లోకి బీఆరెస్ నుండి చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ వేల కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి. కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్యకు కాలుకు గాయం కావడంతో ఎక్కువ సంఖ్యలో చేరికలు పెట్టుకోలేకపోతున్నారని ఆపార్టీ శ్రేణులు చెబుతున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో ఐదు మండలాలతో పాటు, పట్టణంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగే అవకాశం ఉందని ఆపార్టీ వర్గాల సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత చేరికలపర్వం మరింత వేగవంతమవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.