ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థికి నిరసన సెగ… జీవన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి

- తొమ్మిదేళ్లలో ఏం అభివృద్ధి చేశారంటూ నిలదీత
- ప్రచార రథం అడ్డగింత.. వాగ్వాదం
- ప్రచారం చేయకుండానే వెనుతిరిగిన వైనం
విధాత ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండలం లక్కంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి సోమవారం జనం నుంచి నిరసన సెగ అంటుకుంది. ఆపార్టీ నాయకులు గ్రామాల్లో ప్రచారాలకు వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ఇలాంటి ఘటనలు ఎదురవుతున్నాయి. ఆపార్టీపై ప్రజల నుంచి రోజు రోజుకూ నిరసనలు తగలడం ఎక్కువయ్యాయి. నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తానని మోసం చేశావంటూ జీవన్ రెడ్డిని గ్రామస్థులు నిలదీస్తున్నారు.
గత 9 ఏళ్లలో పాఠశాలల అభివృద్ధి ఎక్కడ? లక్కంపల్లి బజార్ కొత్తూరు లింకు రోడ్డు ఎక్కడ? లక్కంపల్లిలో పల్లె ప్రకృతి వనం పార్క్ ఎక్కడ? మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘జీవన్ రెడ్డి నువ్వు చేస్తున్నది రాజకీయమా? లేక టిప్పర్ల రాజకీయమా? ’ అంటూ గ్రామ ప్రజలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. మరోపక్క డొంకేశ్వర్ మండలం అన్నారంలో ప్రచారానికి వెళ్లిన గులాబీ పార్టీ రథాన్ని గ్రామస్తులు అడ్డగించారు.
బీఆర్ఎస్ ప్రచారం రథం మా గ్రామానికి రావొద్దని మహిళలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో మహిళలు, గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ? అంటూ ప్లకార్డులతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక బీఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ శ్రేణులు అక్కడినుండి వెనుతిరిగి వెళ్ళిపోయారు.