బీఆరెస్‌లో చేరిన కాసాని.. సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆరెస్ పార్టీలో చేరారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో కాసాని సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

విధాత : తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆరెస్ పార్టీలో చేరారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో కాసాని సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఆరెస్ నుంచి వెళ్లిపోయిన ఈటల రాజేందర్ కంటే పెద్ద మనిషి కాసాని బీఆరెస్‌లోకి వచ్చారన్నారు. ఈటల బీఆరెస్‌లో ఇతర ముదిరాజ్‌లను ఎదుగనివ్వలేదని ఆరోపించారు.

నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్‌లకు పెద్దపీట వేస్తామని, ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు ఇస్తామన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్‌కు ఇప్పటికే ఉన్నత స్థానం కల్పించామన్నారు. ఎన్నికల తర్వాతా ముదిరాజ్‌లతో భేటీ అవుతానన్నారు. తెలంగాణలోని 119స్థానాల్లో 112 స్థానాలు బీఆరెస్ లెక్కలోకి వస్తాయని, గెలువని చోట ముదిరాజ్‌లను నిలిపి చూడటం అవసరమా అన్నారు.
పార్టీ లో చేరిన వారిలో కాసానితో పాటు టీడీపీ మాజీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్, బోయినపల్లి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పిడి గోపాల్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పనిచేసిన ప్రకాష్ ముదిరాజ్, టీడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బండారి వెంకటేష్ ముదిరాజ్, పటాన్ చెరువు కాంగ్రెస్ లీడర్ సపానాదేవ్ ముదిరాజ్, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మేకల భిక్షపతి ముదిరాజ్, పుట్టిరాజ్ ముదిరాజ్, టీడీపీ కరీంనగర్ నియోజవర్గ ఇంఛార్జ్ కనకయ్య ముదిరాజ్, టీడీపీ ముషీరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ తలారి శ్రీకాంత్ ముదిరాజ్, బాన్సువాడ ఇంఛార్జి కరాటే రమేశ్ ముదిరాజ్, స్టేట్ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు చంద్రహాస్.

ముదిరాజ్ మహాసభ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జగదీశ్వర్ ప్రసాద్ ముదిరాజ్, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మంద శ్రీనివాస్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ నిజాంపేట్ నాయకుడు ఆంజనేయులు ముదిరాజ్, మేడ్చల్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దొంతి నర్సింహులు ముదిరాజ్, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.జగదీష్ యాదవ్, స్టేట్ సెక్రటరీ మన్నె రాజు, నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ జనరల్ సెక్రటరీ దూసకంటి వెంకటేష్, బాచుపల్లి మాజీ ఎంపీటీసీ నందిగామ సత్యనారాయణ, నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ మైనార్టీ అధ్యక్షుడు లష్కర్ అశోక్ కుమార్, టిడిపి గుడి మల్కాపూర్ అధ్యక్షుడు అక్కెర శివరాజు ముదిరాజ్ తదితరులు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.