కాంగ్రెస్ ఇస్తే రాలేదు.. పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది: కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, 4కోట్ల మంది సకల జనులు రాజకీయాలకు అతీతంగా పోరాడి కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ఇస్తే రాలేదు.. పోరాటాలతోనే తెలంగాణ వచ్చింది: కిషన్ రెడ్డి

విధాత : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, 4కోట్ల మంది సకల జనులు రాజకీయాలకు అతీతంగా పోరాడి కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్న వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


1969లో 365 మంది అమాయక విద్యార్థులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, మలిదశ ఉద్యమంలోనూ 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. నాడు సుష్మాస్వరాజ్ నేతృత్వంలో బీజేపీకి సంబంధించిన 160 మంది ఎంపీలు పార్లమెంటు లోపల బయట తెలంగాణ ప్రజల గుండెచప్పుడై కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారన్నారు.


నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించిందని, ఉద్యమం విషయంలోనూ నియంతృత్వంగా వ్యవహరించిందన్నారు. డిసెంబర్ 9 ప్రకటన చేసి మళ్లీ వెనక్కి వెళ్లి కాంగ్రెస్ చేసిన తప్పిదంతో అనేక మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారని, అటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు క్షమించరన్ కిషన్ రెడ్డి విమర్శించారు.