కాంగ్రెస్ నాటకం.. కేసీఆర్ నమ్మకం: మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ నాటకం.. కేసీఆర్ నమ్మకం: మంత్రి హరీష్ రావు
  • ఆపార్టీది టికెట్లు అమ్ముకునే చరిత్ర


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ అంటే నాటకమని, కేసీఆర్ అంటే ప్రజలకు ఎనలేని నమ్మకం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి హరీష్ రావు శనివారం పర్యటించారు. ఉట్నూరు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని, అక్కడి నుండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు.


ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న, నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ గెలుపు లక్ష్యంగా పర్యటన సాగింది. ఆయా సభల్లో మంత్రి ప్రసంగిస్తూ, బీజేపీ తెలంగాణలో మోటార్లకు మీటర్లు బిగించమని ఒత్తిడి చేసినప్పటికీ, కేసీఆర్ వారి ఒత్తిడిలకు భయపడకుండా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారని తెలిపారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పథకాలను కాపీ కొట్టిందని ఆరోపించారు.


జోగు రామన్న నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి ఖిల్లాగా మారిందని పేర్కొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో గతంలో ఉన్నవాళ్లు ఏ పని కావాలన్నా డబ్బులు అడిగే వారని, జాన్సన్ నాయక్ కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని కర్ణాటక రైతులే స్వతంత్రంగా వాహనాలు తీసుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ మంత్రి కేటీఆర్ క్లాస్ మేట్ అని, అతనిని గెలిపిస్తే నియోజవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు.


క్రికెట్ వరల్డ్ కప్ నడుస్తుంది కదా.. క్రికెట్ భాషలో చెప్పాలంటే, బీజేపీ గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సీటు సంపాదించిందని, ఈ ఎన్నికల్లో ఆపార్టీ డకౌవుట్ అవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రన్ ఔట్ అవుతుందని పేర్కొంటూ, రాబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్, బోథ్ అభ్యర్థి అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండేవిటల్, బీఆర్ ఎస్ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.