ఎన్నికలకు సన్నద్ధం కావాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

- బీఆరెస్ శ్రేణులకు పిలుపు
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో బీఆర్ఎస్ సైనికులు సన్నద్ధం కావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్ 30 వరకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాక్షేత్రంలో ఉండాలన్నారు. పదేళ్ళలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ తెలియజేయాలని, ఇంటింటి ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించారు.
బీఆర్ఎస్ గెలుపే ఏకైక లక్ష్యంగా సమష్టిగా పని చేయాలని కోరారు. అభివృద్ది, సంక్షేమ పథకాలతో నిర్మల్ లో బీఆర్ఎస్ కు హ్యట్రిక్ విజయం దక్కడం ఖాయమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలన్నారు.