ప్రజల సమస్యల పరిష్కారానికే ‘ప్రజావాణి’: మంత్రి కోమటిరెడ్డి

ప్రజా వాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం చేయనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు

ప్రజల సమస్యల పరిష్కారానికే ‘ప్రజావాణి’: మంత్రి కోమటిరెడ్డి

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ప్రజా వాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం చేయనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కలిసి మంత్రి కోమటి రెడ్డి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని అక్కడి కక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ సరఫరా సమస్య లేకుండా విద్యుత్ శాఖకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. నల్గొండ పట్టణంలో విద్యుత్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమం ప్రజా వాణి అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తగా ఒక కోటి 50లక్షలు దరఖాస్తులు స్వీకరించి నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయటానికి కట్టుబడి వుందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు చెప్పారు.రూ.20 కోట్ల తో ఐటీఐ వద్ద నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేలా స్కిల్ డెవలపమెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో సాగు నీటి పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కి కలెక్టరేట్ వద్ద 10 ఎకరాలు స్థలం లో లే అవుట్, రోడ్లు పూర్తి చేసి జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని అన్నారు. ఏ.యం.అర్.పీ.ప్రాజెక్ట్ రూ.510 కోట్లతో లైనింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని, రూ.350 కోట్ల లతో డిస్ట్రి బ్యూటరీలు కూడా మరమ్మతులు చేయనున్నట్లు వివరించారు. ఎస్ఎల్బీసీకెనాల్ పనులు వ్యయం పెరిగినందున ప్రభుత్వ ఆమోదంతో పనులు చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఇన్ చార్జి మున్సిపల్ కమిషనర్ అబ్బగోని రమేష్ పాల్గొన్నారు.