బీఆరెస్ ముక్కలవుతుంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అధికారం కోల్పోయిన షాక్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరునెలల్లో పడిపోతుందంటూ పిచ్చిమాటలు పేలుతున్నారని, త్వరలోనే బీఆరెస్ 39 మంది ఎమ్మేల్యేలను

బీఆరెస్ ముక్కలవుతుంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • అధికారం కోల్పోయిన షాక్‌లో కేటీఆర్ పిచ్చి మాటలు
  • భువనగిరిలో 100కోట్లతో మోడల్ క్రికెట్ స్టేడియం
  • రోప్‌వేకు త్వరలో టెండర్లు

విధాత : అధికారం కోల్పోయిన షాక్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరునెలల్లో పడిపోతుందంటూ పిచ్చిమాటలు పేలుతున్నారని, త్వరలోనే బీఆరెస్ 39 మంది ఎమ్మేల్యేలను 39 ముక్కలు చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. ఆదివారం భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే బీఆరెస్ 14ముక్కలవుతుందన్నారు. మా పార్టీ నేత, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా బీఆరెస్‌ను 100మీటర్ల గొయ్యి తీసి బరాబర్‌ బొంద పెడుతామని, లోక్ సభ ఎన్నికల తర్వాతా ఆ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమన్నారు. అధికారంలో ఉండగా అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన సాగించిన బీఆరెస్ నేతలను ప్రజలే కాకుండా ఆ పార్టీ కార్యకర్తలు కూడా తప్పుబడుతుందన్నారు. ప్రగతి భవన్‌లోకి వెళ్ళడానికి అప్పటి హోం మినిస్టర్ మహుమ్మద్ అలీకి కూడా అనుమతివ్వని నియంత్వం వారిదన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను మేము అమలు చేస్తాం. గత ప్రభుత్వం చేసిన అవినీతి సొమ్ముతో 20 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చన్నారు. త్వరలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టబోతున్నామన్నారు. గృహాలకు ఉచిత కరెంటు పథకం విషయంలో కేటీఆర్‌ ఆలోచించి మాట్లాడాలన్నారు.


భువనగిరి నియోజకవర్గం పరిధిలోని బస్వాపూర్, మోడల్ క్రికెట్ స్టేడియం, భువనగిరి మున్సిపాలిటీ గురించి అధికారులతో చర్చించానన్నారు. భువనగిరిలో 100 కోట్లతో స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. భువనగిరి ఖిల్లా రోప్ వే పనులకు తొందరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. బస్వాపూర్ ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా 18 ఏళ్లు నిండిన వారికి కూడా పరిహారం పరిశీలనలో ఉందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్ మెంట్ మార్చటానికి ప్రయత్నం చేస్తామని, దీని మీద అధికారుల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత సమీక్షిస్తామన్నారు. ఔటర్ నుంచి 60 కిలోమీటర్‌ల నుంచి రహదారి పోవాలని, ఆర్‌ఆర్‌ఆర్‌ తెలంగాణకు మణిహారం కాబోతుందన్నారు.


గత ప్రభుత్వం ఆరు లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల భూములను గుంజుకుందన్నారు. గత ప్రభుత్వంలో గొర్లు, బర్లు, బతుకమ్మ చీరలు తప్ప ఏమి చేయలేదని, ఆ పథకాలు కూడా అరకొరగానే అమలు చేసిందన్నారు. కేసీఆర్ యాదాద్రి క్షేత్రం విషయంలో సొంత ఎమ్మెల్యే అభిప్రాయం కూడా తీసుకోలేదని, త్వరలో దేవాదాయ శాఖ మంత్రిని తీసుకొచ్చి యాదాద్రి అభివృద్ధిపై సమీక్ష చేస్తామన్నారు. కొలనుపాక వద్ద వాగుపై 17 కోట్లతో వంతెన నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేసి, టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామన్నారు.