మళ్ళీ బీజేపీ వస్తే రజాకార్ల రాజ్యమే: మంత్రి కొండా సురేఖ

బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే రజాకార్ల రాజ్యం ఎక్కడ వస్తుందోనన్న భయం వెంటాడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆందోళన వ్యక్తం చేశారు

మళ్ళీ బీజేపీ వస్తే రజాకార్ల రాజ్యమే: మంత్రి కొండా సురేఖ

– మతరాజకీయాలు చేస్తున్న బీజేపీ

– రాముడు పేరుతో ఓట్లడుగుతున్న బీజేపీ

విధాత, వరంగల్ ప్రతినిధి: బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే రజాకార్ల రాజ్యం ఎక్కడ వస్తుందోనన్న భయం వెంటాడుతోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ తూర్పు కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేఖ మాట్లాడారు.మైనారిటీ రిజర్వేషన్ తీసేయడం దీనికి నిదర్శనమని విమర్శించారు. మత రాజకీయాలు చేయడంలో బిజెపి ముందంజలో ఉందన్నారు. ఎన్నికలు రావడంతో బీజేపీ రాముని పేరు చెప్పి ఓట్లు అడగడం సిగ్గుచేటన్నారు. రామున్ని ప్రతిష్టించాలంటే , రాముడిని ఒక్కడినే కాదు, సతీ సమేతంగా విగ్రహ ప్రతిష్ట చేయాలి గానీ, నరేంద్ర మోడీ బ్రహ్మచారి కాబట్టి, సీతతో కాకుండా రామునొక్కడినే ప్రతిష్టించాడన్నారు. తూర్పులో బీఆర్ఎస్ ఖాళీ అయిందన్నారు. బిజెపితోనే మాకు పోటీ అన్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షలు ఉన్న రైతుల రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు.
ఇప్పటికే 92 శాతం రైతుబంధు ఇచ్చామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద నీరు వదలడంలో చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు రెండవ తేదిన జీతాలు వేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా నిలబడ్డ వారంతా చరిష్మా లేని అభ్యర్థులన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే విశ్వాసం వ్యక్తంచేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య నిలబడుతుంది,ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు.
బీజేపీ ప్రజలకు చేసిన మోసాలు ఎండగడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉన్నదని, కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న కడియం కావ్యను విజయ తీరాలకు చేర్చాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు.