తెలంగాణ ఎన్నిక‌ల తేదీల‌పై మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ ఎన్నిక‌ల తేదీల‌పై మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

విధాత‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీల‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల తేదీలు మ‌న‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని, ఆ అంకెలు మ‌న‌కు క‌లిసి వ‌స్తాయ‌న్నారు. ఎన్నిక‌ల తేదీలు చూస్తుంటే.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్ట‌డం ప‌క్కా అనిపిస్తుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.


న‌వంబ‌ర్ 30 ఎన్నిక‌లు, డిసెంబ‌ర్ 3న కౌంటింగ్.. ఈ తేదీల‌ను చూస్తుంటే క‌రెక్ట్‌గా ఈసారి మ‌న‌కు లెక్క కూడా కుదిరిన‌ట్టు ఉంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 30, 03, కేసీఆర్ మూడోసారి కూడా ముఖ్య‌మంత్రి అవుడు హ్యాట్రిక్ ప‌క్కా అనిపిస్తుంది. మ‌న‌కు అన్ని క‌లిసి వ‌స్తున్నాయి. మూడు మూడు ఆరు.. మ‌న ల‌క్కీ నంబ‌ర్ కూడా ఆరే. మూడోసారి కేసీఆర్ ముఖ్య‌మంత్రి అవుడు కూడా ప‌క్కానే ఉన్న‌ది. తేదీలు కూడా మంచిగానే కుదిరిన‌ట్టు అనిపిస్తుంది అని కేటీఆర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.


ఇక ఎన్నిక‌లు వ‌చ్చాయి.. ఇక సంక్రాంతి పండుగ‌కు గంగిరెద్దుళ్లోళ్లు వ‌చ్చిన‌ట్లు కాంగ్రెస్ నాయ‌కులు వ‌స్తార‌ని కేటీఆర్ తెలిపారు. నోటికొచ్చిన‌ట్టు అడ్డ‌మైన మాట‌లు మాట్లాడుతారు.. నోటికొచ్చిన క‌థ‌లు చెబుతారు.. సీఎం కేసీఆర్‌ను, ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డిని ఓడ‌గొట్టాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు చెబుతారు. విచ‌క్ష‌ణ‌తో, చైత‌న్యాన్ని ప్ర‌ద‌ర్శించి ఓటేయ్యాలి. క్యాలికులేటేడ్‌గా ఆలోచించాలి. ఆగం కావొద్దు. 2014లో మ‌న ప‌రిస్థితి ఏంది..? ఇప్పుడు ప‌రిస్థితి ఏంది? అనేది ఆలోచించాలి. క‌రెంట్, మంచినీళ్లు, వ్య‌వ‌సాయం, సాగునీటి, సంక్షేమం గురించి ఆలోచించండి. రెచ్చ‌గొట్టే ముచ్చ‌ట్లు చెబితే ఆగం కావొద్దు.. ఆందోళ‌న చెందొద్దు. మేం చెప్పింది వాస్త‌వ‌మైతే ధ‌ర్మారెడ్డిని 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాల‌ని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.


కాంగ్రెస్ హ‌యాంలో కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మ‌ర్ల ప‌రిస్థితిని చూశామ‌ని కేటీఆర్ తెలిపారు. ఆరు గంట‌ల క‌రెంట్ కూడా మూడుసార్లు ఇచ్చేవారు. దీంతో నాడు వ్య‌వ‌సాయం ఆగ‌మైంది. ప‌రిశ్ర‌మ‌లు న‌డుపుదామంటే క‌రెంట్ లేదు. మరి ఇవాళ 60 ఏండ్ల‌లో క‌రెంట్ ఇవ్వ‌ని కాంగ్రెస్.. ఇవాళ వ‌చ్చి అది చేస్తా.. ఇది చేస్తా అని డైలాగులు కొడితే మోస‌పోదామా..? ఆరు నెల‌ల్లోనే క‌రెంట్ స‌మ‌స్యను ప‌రిష్క‌రించిన కేసీఆర్‌కు ఓటేద్దామా? అనేది ఆలోచించుకోవాల‌ని కేటీఆర్ సూచించారు.