కేసీఆర్ క‌లిసిరా.. కేద్రంపై ఒత్తిడి చేద్దాం: మంత్రి పొన్నం

కేసీఆర్ క‌లిసిరా.. కేద్రంపై ఒత్తిడి చేద్దాం: మంత్రి పొన్నం

విధాత‌: పొలంబాట పేరుతో మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న ప‌ర్య‌ట‌న‌ను మంత్రి పొన్న ప్ర‌భాక‌ర్ విమ‌ర్శించారు. శాసనసభ సమావేశాల‌కు హాజ‌రు కాకుండా ప్ర‌తిప‌క్ష‌నాయకుడినని బాధ్య‌త‌తో పంట‌పొలాలు తిరుగుతున్న కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం త‌రుపున పొలాల‌కు ఇబ్బంది ఉంటే చూపించాల‌న్నారు. బీఆరెస్ అధికారంలో ఉన్న‌ప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయ‌ని, దాంతో భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. వర్షాభావ ప‌రిస్థితుల మూలంగానే రైతుల‌కు న‌ష్టం జరిగింద‌న్నారు. క‌రువును కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెచ్చింద‌న‌డంలో అర్థం లేద‌ని, కేసీఆర్ అనుభ‌వ‌జ్ఞులు ఇలా మాట్లాడ‌టం స‌రికాద‌ని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. క‌రువును బీఆరెస్ పార్టీనో లేదా కాంగ్రెస్ పార్టీనో తెచ్చింద‌న‌డం అర్థ‌ర‌హిత‌మ‌న్నారు.

ప్రాజెక్టుల‌పై ఎప్పుడు చ‌ర్చ‌కు ర‌మ్మ‌న్న రావ‌డానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. బీఆరెస్‌ అధికారం నుంచి దిగేనాటికి ప్రాజెక్టుల్లో నీరు ఎంత ఉన్న‌ద‌న్న విష‌యంపై చ‌ర్చిద్దామ‌న్నారు. ఈరోజు తాగు, సాగు నీటిని ఎలా వాడమో స్పష్టంగా చెప్పడానికి, చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌న్నారు. బీఆరెస్ పార్టీ బీజేపీతో నిజంగా క‌లిసి లేన‌ట్ల‌యితే తెలంగాణ ప్ర‌యోజ‌నాలు, రైతుల ప్ర‌యోజ‌నాల‌ని కాపాడాల‌నుకుంటే మాతోపాటు క‌లిసి రండీ బీజేపీపై ఒత్తిడి తేవ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నామ‌ని సూచించారు.

ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆదుకున్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయని, తెలంగాణలో నీటి లభ్యత, భూగర్భ జలాలు అడుగంటిన‌టువంటి సంఘ‌ట‌న‌లపై కేంద్రంపై ఒత్తిడి తేవ‌డానికి బీఆరెస్ కూడా కాంగ్రెస్‌తో పాటు రావాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కోరారు. కేసీఆర్ పర్యటన చేసుకోవచ్చు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వానికి సూచనలు చేసే అవకాశం ఇస్తున్నామ‌న్నారు. నియంతృత్వంగా వ్య‌వ‌హ‌రించ‌ము, స్వేచ్ఛ‌గా తిర‌గ‌వ‌చ్చున్నారు.

బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ రైతుల వ‌ద్ద ముస‌లి క‌న్నీరు కారుస్తూ దీక్ష‌లు చేస్తున్నాడన్నారు. మీరు కూడా రండీ దీక్ష గ‌ల్లీలో కాదు ఢిల్లీలో ప్ర‌ధాని మోదీ ద‌గ్గ‌ర చేయాల‌న్నారు. ప్ర‌ధాని మోదీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదు, తెలంగాణ రైతన్నను ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వ‌మ‌నీ మీరు ఎప్పుడు అడగలేదు, అడిగే ధైర్యం కూడా మీకు లేద‌న్నారు. కేంద్రంతో కొట్లాడే ఆలోచ‌న మాకు లేదు, కేంద్రం స‌హకారం తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని మంత్రి వెల్ల‌డించారు.

మాజీమంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ నేతన్నల మీద కాంగ్రెస్‌కు ఎందుకు ఇంత కక్ష అంటున్నారు, మూడు నెల‌ల్లో మా ప్ర‌భుత్వం నేత‌న్న‌ల‌పై ఏ క‌క్ష‌పూరిత‌మైన ప‌ని చేశామ‌ని ప్ర‌శ్నించారు. గతంలో బతుకమ్మ చీరల పైసలు ఇవ్వ‌క‌పోవ‌డంతో నేత‌న్న‌లు ఇబ్బంది పడుతున్నారు. అది మీరు చేసిన పాపమే అని దుయ్య‌బట్టారు. నేత‌న్న‌కు ప్ర‌తిరోజు ఉపాధి ఉండే విధంగా టెక్స్‌టైల్ రంగాన్ని పటిష్టం చేస్తూ రాష్ట్రంలో అవసరమున్న ప్రతి బట్ట వారి దగ్గర కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని, నేత‌న్న‌లు రాజ‌కీయ చ‌ట్రంలో ప‌డ‌కండ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ విజ్ఞ‌ప్తి చేశారు.