కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బ్యారేజీలో ఒకటి రెండు పీయర్లు కుంగిపోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం కోడిగుడ్డు మీద ఈకలు పీకుతుందని మాజీ మంత్రి, బీఆరెస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతను డైవర్ట్‌ చేసేందుకు మేడ్డిగడ్డ సందర్శన
  • తమకు మాట్లాడే అవకాశమివ్వకుండా సభా నిబంధనల ఉల్లంఘన
  • మేడిగడ్డ పర్యటనతో మాపై బురదజల్లే ప్రయత్నం
  • ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆరెస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆగ్రహం

విధాత, హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బ్యారేజీలో ఒకటి రెండు పీయర్లు కుంగిపోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం కోడిగుడ్డు మీద ఈకలు పీకుతుందని మాజీ మంత్రి, బీఆరెస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీశ్‌ రావు మాట్లాడారు. శాసనసభలో అధికారపక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పారు. మేడిగడ్డ పర్యటన ద్వారా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలేమిటో లబ్ధిపొందిన ప్రజలను అడగాలని ప్రభుత్వానికి సూచించారు.

పార్లమెంటు ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కాళేశ్వరం వివాదాన్ని వాడుకుంటున్నారుర. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదని.. అది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల ఉపయోగం కలగలిసిన సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో పంజాగుట్ట ఫ్లై ఓవర్‌ కూలి 20 మంది చనిపోయారని, దేవాదుల పైపులు పేలి నీళ్లు ఆకాశమంత ఎగిరాయన్నారు. అలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, కానీ తాము ముందుకు వెళ్లాం కదా అని తెలిపారు.

నల్లగొండ సభ నుంచి డైవర్ట్‌ కోసమే మేడిగడ్డ సందర్శన

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించొద్దని తాము నిద్ర లేపితే లేచారని, ఈ రోజు బీఆరెస్‌ సభ ఉందని మీరు ప్రజల దృష్టిని డైవర్ట్‌ చేయడం కోసం పోటీగా మేడిగడ్డ సందర్శన కార్యక్రమం పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. మేడిగడ్డ సందర్శనలో భాగంగా మీరు వెళ్లే దారిలో రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలన్నారు.

కాళేశ్వరం ఫలితాలను గురించి రైతులను అడగాలని సూచించారు. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రంగనాయకసాగర్‌ను చూసి అద్భుతమని మెచ్చుకున్నారని గుర్చుచేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టులోని సరిదిద్దే ప్రయత్నం చేయాలని సూచించారు. విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు.

చాప్రాల్‌ వైల్డ్‌ లైఫ్‌ ప్రాంతంలో ప్రాణహిత కట్టాలని చూస్తే అనేక అడ్డంకులు వస్తాయని చెప్పారు. నాడు కేంద్రం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. ప్రాణహిత చేవెళ్లను ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. తాము నీళ్లు లేని ప్రాంతం నుంచి ప్రాజెక్టును తరలించి పంటలకు నీళ్లు అందించామన్నారు. మూడు కోట్ల మెట్రిక్‌ టన్నుల పంట పండిందంటే ఆ జలాల వల్లే జరిగిందని స్పష్టం చేశారు.

Somu

Somu

Next Story