నల్గొండ చైర్మన్ గిరికి కాంగ్రెస్ అవిశ్వాస అస్త్రం

నల్గొండ మున్సిపల్ చైర్మన్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు ప్రయోగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడం కాంగ్రెస్ కౌన్సిలర్లకు కొత్త ఆశలు రేపింది

నల్గొండ చైర్మన్ గిరికి కాంగ్రెస్ అవిశ్వాస అస్త్రం

– సంఖ్యాబలం ఉందంటూ తీర్మానం

– అదనపు కలెక్టర్ కు పంపిన తీర్మాన ప్రతి

– బీఆర్ఎస్ కౌన్సిలర్ల అయోమయం

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ మున్సిపల్ చైర్మన్ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ అస్త్రాలు ప్రయోగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడం కాంగ్రెస్ కౌన్సిలర్లకు కొత్త ఆశలు రేపింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ 48 స్థానాల్లో చెరి 20 చొప్పున గెలిచారు. బీజేపీ ఆరు గెలవగా, ఎంఐఎం ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒకరు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పట్లో బీజేపీ, టీఆర్ఎస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. సంఖ్యాబలం ఉండడంతో ఇప్పటివరకు మున్సిపల్ చైర్మన్ స్థానంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ మందడి సైదిరెడ్డి చైర్మన్ గా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడం, అంతకుముందే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై వ్యతిరేకతతో 11 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడంతో ఇప్పుడు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు బలం పెరిగింది. దీంతో చైర్మన్ స్థానంలో పాగా వేయాలని ఇప్పటికే అవిశ్వాస తీర్మానాన్ని సిద్ధం చేసింది. మెజారిటీ సభ్యుల సంతకాలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు అవిశ్వాస తీర్మాన ప్రతిని సమర్పించారు.

మెజార్టీ తమకే ఉందని..

నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉందని లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ కు సంతకాలు చేసి అవిశ్వాస తీర్మానం కాపీని శనివారం కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అందజేశారు.

నెక్స్ట్ ఏంటి?

కాంగ్రెస్ కౌన్సిలర్లు 30 మందితో కూడిన అవిశ్వాస పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ కు అందించారు. అయితే 15 రోజుల్లో అధికారులు అవిశ్వాసానికి సంబంధించిన నోటీసులను ప్రస్తుత చైర్మన్ కు, సంబంధిత అధికారులకు పంపుతారు. ఈ 15 రోజుల్లోనే ఓ ప్రత్యేక సమావేశాన్ని అవిశ్వాసంపై అధికారులు ఏర్పాటు చేస్తారు. అట్టి సమావేశంలో సంఖ్యాబలం ఉన్న కౌన్సిలర్లు తమ అవిశ్వాసాన్ని తెలిపేలా చేతులు ఎత్తి ప్రదర్శిస్తారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించి ఇక్కడి ఫలితాలను ఎన్నికల అధికారులకు పంపుతారు. తర్వాత మరో 15 రోజుల్లో నూతన చైర్మన్లు ఎన్నుకునేందుకు అధికారులు మరో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

18న కౌన్సిల్ సమావేశం

నల్గొండ మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం ఈనెల 18న ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసంపై చర్చ జరపనున్నారు.

పాలుపోలేని స్థితిలో బీఆర్ఎస్ చైర్మన్, కౌన్సిలర్లు

కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని పెడుతుండడంతో బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఇన్ని రోజులు ఎమ్మెల్యే అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కౌన్సిలర్లు, చైర్మన్ అంతర్మథనంలో పడ్డారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో తమకు అనుకూలంగా ఉండే వారితో మంతనాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.