నామినేషన్ ఉపసంహరించుకున్న పటేల్ రమేశ్‌రెడ్డి

సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన పటేల్ రమేష్ రెడ్డి అధిష్టానం బుజ్జగింపులతో వెనక్కి తగ్గి బుధవారం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

నామినేషన్ ఉపసంహరించుకున్న పటేల్ రమేశ్‌రెడ్డి
  • నాటకీయ పరిణామాల మధ్య ఆర్డీఆర్‌కు తొలగిన అడ్డంకి
  • ఎంపీ హామీతో వెనక్కి తగ్గిన రమేశ్‌రెడ్డి


విధాత : సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన పటేల్ రమేష్ రెడ్డి అధిష్టానం బుజ్జగింపులతో వెనక్కి తగ్గి బుధవారం తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఉదయం ఏఐసీసీ దూతలుగా మాజీ ఎంపి మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీలు రమేశ్‌రెడ్డితో నామినేషన్ ఉపసంహరింపచేసేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు.


విషయం తెలుసుకున్న రమేశ్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహంతో వారిని అడ్డుకుని వారిపై దాడికి ప్రయత్నించారు. అభిమానుల నిరసనల మధ్య రమేశ్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లిన రవి, చౌదరీలకు కుటుంబ సభ్యుల నుంచి కూడా వాగ్వివాదం ఎదురైంది. ఒక దశలో వారు కూర్చున్న గదిపై కార్యకర్తలు రాళ్లు రువ్వగా అద్దాలు పగిలాయి.


దాదాపు మూడు గంటల చర్చలు సాగగా, అప్పటిదాకా రమేశ్‌రెడ్డి ఇంటివద్ద హైడ్రామా కొనసాగింది. మరోవైపు నామినేష్లన ఉపసంహరణ గడువు దగ్గర పడుతుండటం కూడా మరింత టెన్షన్‌కు దారితీసింది. మల్లురవి, రోహిత్ చౌదరీల సుదీర్ఘ చర్చల అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వయంగా రమేశ్‌రెడ్డితో ఫోన్‌లో చర్చించారు.


రమేశ్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని వేణుగోపాల్ ఇచ్చిన హామీతో శాంతించిన రమేశ్‌రెడ్డి స్వయంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అయితే రమేశ్‌రెడ్డి నిర్ణయం పట్ల ఆయన అభిమానులు, కార్యకర్తలు కొద్దిసేపు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.