బెంబెలెత్తిస్తున్న తనిఖీలు.. అవగాహాన లేమితో జనం తిప్పలు

విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న విస్తృత తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, నగలు, ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసుకున్న కానుకలు పట్టుబడుతున్నాయి. అయితే తనిఖీల్లో ఎన్నికల వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం లేని సాధారణ ప్రజలు తమకు పలు ఆదాయ, విక్రయ, కొనుగోలు మార్గాల ద్వారా వచ్చిన డబ్బును వెంట తీసుకెలుతున్న క్రమంలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతూ, కేసులతో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపధ్యంలో సాధారణ ప్రజలు తమ వెంట ఎంత డబ్బు తీసుకోవచ్చు..పట్టుబడిన తమ డబ్బు ఎలా తిరిగి పొందాలన్నదానిపై అవగాహన లేక వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఓ వ్యక్తి తన వెంట 50వేల రూపాయలను తీసుకెళ్లవచ్చు. అంతకుమించి నగదు తీసుకెళ్లిన, నగలు తీసుకెళ్లినా వాటికి తగిన పత్రాలు సమర్పించని పక్షంలో ఐటీ, జీఎస్టీ, ఈడీ తదితర శాఖలకు పట్టుబడిన వాటిని అప్పగించనున్నారు.ఖ్యంగా 2లక్షల నుంచి 10లక్షలు ఆపైన పట్టుబడితే నలుగురు సభ్యుల జిల్లా ఎన్నికల కమిటీకి అప్పగిస్తారు. అప్పుడు సంబంధిత డబ్బు యజమాని తన డబ్బు ఎలా వచ్చింది.. ఎందుకు వాటిని తరలిస్తున్నారన్నదానిపై స్పష్టతతో కూడిన ఆధారాలు చూపాల్సివుంటుంది. కమిటీ సంతృప్తి చెందితే వెంటనే డబ్బు తిరిగి పొందవచ్చు. లేకుంటే మాత్రం పోలీసు శాఖ ఆ డబ్బును స్వాధీనం చేసుకుని ఐటీకి నివేదిస్తుంది. వారి విచారణ పురోగతిని అనుసరించి చర్యలు తీసుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 10వేలకు మంచి నగదు చెల్లింపులకు ఆస్కారం లేదు. ఎవరైన ఓటర్లను ప్రలోభా పెట్టే వస్తువులు తరలించినా పట్టుబడితే కేసులు తప్పవు.