అవకాశం వచ్చింది.. ఏకమవుదాం: పిల్లి రామరాజు

అవకాశం వచ్చింది.. ఏకమవుదాం: పిల్లి రామరాజు
  • నల్లగొండ ఒక్కరిద్దరి జాగీర్ కాదు
  • బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ‘సందర్భం వచ్చింది. సమయం సమీపిస్తున్నది. సకల జనులం, సబ్బండ వర్గాలం ఏకమవుదాం. నల్లగొండ నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రం మారుద్దాం’ అని బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నల్లగొండ మండల అసమ్మతి నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.


నియోజకవర్గాన్ని ఆధిపత్య వర్గాలు 70 ఏండ్లు ఏలినా, ఏ దళిత, బహుజన వర్గాలు, అగ్రకుల పేదలను ఎమ్మెల్యేలుగా ఎదుగనీయలేదన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా అవకాశాలు దక్కనియ్యలేదన్నారు. నియోజకవర్గం ఏఒక్కరి, ఇద్దరు వ్యక్తులదో లేదా ఒక్కటి, రెండు కులాల సొత్తొ కాదన్నారు. మన వాటా మనకు దక్కడానికి పోరాడుదామన్నారు. మేము బిఫాం అడుగడంలో ధర్మం, న్యాయం ఉందన్నారు. బీసీల దగ్గర డబ్బులు లేవని, రాజకీయాలు తెలువువని హేళన చేస్తున్నారు.


అలాంటి వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్న ఎమ్మెల్యే నల్లగొండ ప్రజలకు దూరమైతే, ప్రతిపక్షంలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదేండ్లు నల్లగొండ నియోజకవర్గం పట్టించుకోకుండా పోయి ఇవాళ మళ్లీ కుర్చీ కావాలని ఆరాటపడుతున్నాడని… ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. దళిత బంధు, బీసీ బంధు, గృహ లక్ష్మీ వస్తయని ఓట్ల కోసం ఆశపెడుతున్నారని, ఈ ఎన్నికల్లో అన్నీ బంధేనన్నారు.