ఎంపీ అభ్యర్థుల ఖరారులో పార్టీల కీలక కసరత్తు
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల

- హస్తినలో కమలదళం
- హైదరాబాద్‌లో కేసీ వేణుగోపాల్ మంతనాలు
- ఆశావహుల్లో టెన్షన్
- బీఆరెస్‌లో కరువైన హడావుడి
విధాత : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో కీలక కసరత్తులో నిమగ్నమయ్యాయి. ఢిల్లీలో శనివారం బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమవ్వగా, కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బోర్డు సభ్యుడు ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, డీకే.అరుణ, ఈటల రాజేందర్‌లు హాజరయ్యారు. వారు అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నేడో రేపో పార్టీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడవచ్చని సమాచారం. తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాల్లో 10స్థానాలు గెలువాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ ప్రధానంగా సిటింగ్ స్థానాలు కరీంనగర్, నిజమాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు వరంగల్, మహబూబ్‌నగర్, జహీరాబాద్, భువనగిరి, చేవెళ్ల, మెదక్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలలో గెలుపు అవకాశాలున్నాయని కమలనాథులు భావిస్తున్నారు. ఆ స్థానాల్లో గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం నేడో రేపో అభ్యర్థులపై కీలక ప్రకటన చేయవచ్చని పార్టీ వర్గాల కథనం. సిటింగ్‌లు బండి సంజయ్, అర్వింద్‌కుమార్, కిషన్‌రెడ్డిలకు మరోసారి టికెట్లు ఖాయంకాగా, అదిలాబాద్‌లో సోయం బాపురావు ను మార్చే అవకాశముందంటున్నారు. మహబూనగర్‌లో డీకే అరుణ లేక జితేందర్‌రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్‌లు పేర్లతో తొలి జాబితా వెలువడవచ్చని తెలుస్తుంది. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ పడుతున్నారు. భువనగిరిలో బూర నర్సయ్యగౌడ్‌కు పోటీగా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, పార్టీ ఉపాధ్యక్షుడు జి.మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు టికెట్ ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణ బలాబలాల మేరకు నర్సయ్యగౌడ్‌కు టికెట్ దక్కవచ్చని భావిస్తున్నారు. మెదక్ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జహీరాబాద్, వరంగల్, పెద్దపల్లి, మహబూబ్‌బాద్, నల్లగొండలలో కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. హైదరాబాద్‌లో రాజాసింగ్ లేదా మరో బలమైన నేతను పోటీకి దించి ఎంఐఎంకు గట్టి పోటీ ఇవ్వాలని తలపోస్తుంది.వలస నేతలపై కన్నేసిన బీజేపీ చేరికల పిదప కొన్ని స్థానాల్లో వారిని పార్టీ తరుపునా పోటీ చేయించాలని చూస్తుంది. బీఆరెస్, కాంగ్రెస్‌లలో టికెట్ దక్కని నేతలను బీజేపీ తరుపునా టికెట్లు ఇచ్చే అవకాశం లేకపోలేదు.
కాంగ్రెస్‌లో కీలక చర్చలు
ఎంపీ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం కీలక చర్చలు సాగించింది. వైఎస్.షర్మిల కుమారుడి పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ సీనియర్ మంత్రులు, ముఖ్యనేతలు భేటీయై ఎంపీ అభ్యర్థుల ఎంపికకై చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ఈ దఫా డబుల్ డిజిట్ స్థానాల గెలుపుపై ధీమాగా ఉంది. ఆరుగ్యారంటీలు, ఎన్నికల హామీలతో అధికార పార్టీకి కలిసొచ్చే వాతావరణంతో గెలుపు నమ్మకంతో సాగుతుంది. 17స్థానాల్లో 10స్థానాలకుపైగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై దాదాపుగా తుది నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. వాటిలో మహబూబ్‌నగర్ నుంచి వంశీచందర్‌రెడ్డి పేరు ఇప్పటికే ప్రకటించగా, నల్లగొండ నుంచి కె.జానారెడ్డి, మల్కాజిగిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, చేవెళ్ల నుంచి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీతారెడ్డి, నాగర్ కర్నూల్‌లో మల్లు రవి, నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి ఎంపీ వెంకటేశ్, జహీరాబాద్‌లో సురేష్ షేట్కార్, మహబూబ్‌బాద్ నుంచి బలరాంనాయక్ లేదా విజయబాయి, మెదక్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, నీలం మధుముదిరాజ్, జగ్గారెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. సికింద్రాబాద్ సీటులో బొంతు రాంమోహన్, విద్యా స్రవంతిలు, భువనగిరి నుంచి ఆర్. సర్వోత్తంరెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి, శ్రీనిధిరెడ్డిలు పోటీలో ఉన్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ స్థానాలలో బహుముఖ పోటీ నెలకొంది ఆయా స్థానాల్లో అభ్యర్థులపై ఖర్గే, వేణుగోపాల్‌లతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు పూర్తి చేశారని, తొలి జాబితాను నేడో రేపో వెల్లడిస్తారని తెలుస్తుంది.
బీఆరెస్‌లో కనిపించని హడావుడి
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం నైరాశ్యంలో ఉన్న బీఆరెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహాకాల్లో భాగంగా లోక్‌సభ, శాసన సభ నియోజకవర్గాల వారిగా సమావేశాలను దాదాపు పూర్తి చేసింది. గత ఎన్నికల్లో తొమ్మిది లోక్‌సభ స్థానాలు సాధించిన బీఆరెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో ఈ దఫా విజయం కోసం చమటోడ్చాల్సిన పరిస్థితిలో పడిపోయింది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ కాంగ్రెస్‌లో చేరిపోగా, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరే పరిస్థితులు లేక తిరిగి బీఆరెస్ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధపడ్డారు. కరీంనగర్‌లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఖమ్మంకు ఎంపీ నామా నాగేశ్వర్‌రావులు అభ్యర్ధులుగా ఉన్నారు. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఖరారు చేయాల్సిన బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎంపీ ఎన్నికల్లో పోటీకి బీఆరెస్ నుంచి అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆసక్తి ఉన్న అభ్యర్థుల పేర్లనైనా ముందు ప్రకటించాలన్న వాదన ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. నల్లగొండ నుంచి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నారు. మిగతా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులెవరన్నదానిపై అయోమయం కొనసాగుతుంది. ప్రస్తుతం దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గాలి వీస్తుండటం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీలను ఢీ కొట్టి ఎన్నికల్లో గెలువాలంటే గట్టి పోరాటమే చేయాల్సివుంది. దీంతో పాటు కనీసంగా 100కోట్లకు పైగా ఖర్చు చేయాల్సివున్న నేపథ్యంలో అంత ఖర్చు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపుపై నమ్మకం లేకపోవడంతో బీఆరెస్ నుంచి ఎంపీ టికెట్ల కోసం పోటీ కరువైందన్న వాదన వినిపిస్తుంది.