బీఆరెస్‌కు ఓటమి భయం: పూదరి తిరుపతి

- పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటి?
- ప్రేమ సాగర్ పై అసత్య ఆరోపణలు
- మంచిర్యాల కాంగ్రెస్ నేత పూదరి తిరుపతి
విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: బీఆరెస్ పదేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని, ఆపార్టీకి ఓటమి భయం పట్టుకుందని మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి విమర్శించారు. ఎమ్మెల్యే దివాకర్ రావు ఓటమి భయంతో తన అనుచరులతో మాజీ ఎమ్మెల్సీ, మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ సాగర రావు పై అసత్య ఆరోపణలు చేయిస్తున్నాడని అన్నారు. ప్రేమ్ సాగర్ రావు నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్ జగన్ మోహన్ రావుతో కలసి పూదరి తిరుపతి మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు విజయం తథ్యమని తెలియడంతో బీఆరెస్ నాయకులు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే దివాకర్ రావును ఓడించాలని ప్రజలు నిర్ణయించడంతో దిక్కుతోచని స్థితిలో బీఆరెస్ నేతలున్నారని అన్నారు. హైదరాబాద్ లో భూ వివాదం కోర్టు పరిధిలో ఉండగా, ప్రేమసాగర్ రావు భూకబ్జా చేశాడని బీఆరెస్ నేతలు ఆరోపణలు చేయడం కోర్టు ధిక్కారమవుతుందని పేర్కొన్నారు. ప్రేమ్ సాగర్ రావు నీతి, నిజాయితీగా వ్యాపారం చేసి పైకి వచ్చారని తెలిపారు.
రౌడీ, గుండాయిజం, భూకబ్జాలు చేస్తున్నాడని బీఆరెస్ ఆరోపించడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యే తనయుడు నడిపెళ్లి విజిత్ రావుకే ఇవన్నీ తగవన్నారు. ఎమ్మెల్యే తన తండ్రి పేరిట 57 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమించే ప్రయత్నం చేసారని ఆరోపించారు. బీఆరెస్ నేతల భూకబ్జాల బాగోతాన్ని బయటపెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ , నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేణు , మంచిర్యాల మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు ఉప్పలయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేశ్ పాల్గొన్నారు.