నవంబర్ 30న తెలంగాణ పీడ విరగడ: రేవంత్ రెడ్డి

నవంబర్ 30న తెలంగాణ పీడ విరగడ: రేవంత్ రెడ్డి
  • సీఎం ఫాం హౌజ్ లోనే.. బ‌య‌ట‌కు రావాల్సిన ప‌ని లేదు
  • కాంగ్రెస్ కు అధికారం ఖాయం
  • డిసెంబ‌ర్‌లో అద్భుతాలు జ‌ర‌గ‌బోతున్నాయి



విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణకు పట్టిన పీడ నవంబర్ 30న విరగడ కాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని, ఇక ఆయన ఫాం హౌస్ నుంచి బయటకు రావాల్సిన పనిలేదన్నారు. సోమ‌వారం ఆయ‌న‌ ఢిల్లీలో విలేకరుల‌తో మాట్లాడారు. తెలంగాణకు విముక్తి కలిగే తేదీని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిందన్నారు. త్వ‌ర‌లోనే తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని వెల్ల‌డించారు.


డిసెంబర్ లో అద్భుతం జరగబోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది, ఈ మేర‌కు రాబోయే విజయదశమిని ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ఆరు గ్యారంటీలు ప్రకటించగానే కేసీఆర్ కు చలి, జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు. సంపద పెంచాలి, పేదలకు పంచాలి అన్నదే కాంగ్రెస్ విధానమ‌ని పేర్కొన్నారు.


కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు, పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకుందని, అమరవీరుల స్థూపం, సచివాలయ నిర్మాణంలో కూడా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేద‌న్నారు. అధికారం కోల్పోతున్నామన్న భయం బిల్లా-రంగాలలో మొదలైందన్నారు.


అందుకే స్థాయి లేక‌పోయినా సోనియా గాంధీ, రాహుల్ ల‌ను విమ‌ర్శిస్తున్నార‌న్నారు. బీజేపీ, బీఆరెస్‌ల‌ ఫెవికాల్ బంధం ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునేందుకే బీజేపీ, బీఆరెస్ డ్రామాలు ఆడుతున్నాయ‌న్నారు. బీజేపీ, బీఆరెస్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతీ తెలంగాణ బిడ్డపై ఉందన్నారు.