సీఎం రేవంత్ రెడ్డి మొదటి నెల పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్
పదేళ్ల బీఆరెస్ ప్రభుత్వాన్ని గద్దె దించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పగ్గాలను స్వీకరించి ఆదివారంతో సరిగ్గా నెలరోజులు అవుతున్నది

- ఖజానా ఖాళీ అని చెప్పడంలో సక్సెస్
- అయినా మొదటి వారంలో జీతాలు
- కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కదలిక
- ప్రమాణం అనంతరమే 2 హామీల అమలు
- మిగతా హామీలకు దరఖాస్తుల స్వీకరణ
విధాత, హైదరాబాద్: పదేళ్ల బీఆరెస్ ప్రభుత్వాన్ని గద్దె దించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర పగ్గాలను స్వీకరించి ఆదివారంతో సరిగ్గా నెలరోజులు అవుతున్నది. అంచనా వేయడానికి తక్కువ కాలమే అయినా.. తొలి అడుగులను బట్టి మలి అడుగులను అంచనా వేయాల్సి వస్తే రాష్ట్రంలో ఒక ఆశావహ వాతావరణం నెలకొన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి గడీ పాలనకు నిదర్శనంగా చెబుతూ వచ్చిన ప్రగతిభవన్‌ను ప్రజలకు చేరువ చేయడం ద్వారా తమది ప్రజా పాలన అని చాటుకోవడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఫలించిందనే అనుకోవాలి. ప్రగతి భవన్ లోపల ఎలా ఉంటుందో కూడా తెలియని ప్రజలకు అక్కడికి వెళ్లి తమ సమస్యలను విన్నవించుకునే అవకాశం కల్పించింది.
ఎవరు ఏ రూపంలో దరఖాస్తులు ఇచ్చినా స్వీకరించి పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామన్నధీమా కలిగేలా చేయగలిగింది. జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమాలతో మంత్రులు సైతం అందుబాటులో ఉంటున్నారనే అభిప్రాయం నెలకొన్నది. ఇక ప్రమాణం స్వీకరించిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేసిన ప్రభుత్వం.. మిగిలినవాటి కోసం కొత్త లబ్ధిదారులనుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో ప్రత్యేకించి రేషన్‌కార్డుదారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. మరోవైపు తొలి సమీక్షా సమావేశంలోనే రాష్ట్రం అప్పుల చిట్టా తెరిపించి.. తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయడం ద్వారా బీఆరెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇదే సమయంలో తాము అమలు చేయాలనుకున్న పథకాలకు నిధుల లోటు అనేది గత ప్రభుత్వ పాపమేనని చెప్పుకొనేందుకు ప్రయత్నించింది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే సచివాలయం కేంద్రంగా పరిపాలన మొదలు పెట్టారు. జెట్ స్పీడ్‌తో నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీల అమలును వెంటనే మొదలు పెట్టాలని భావించినా ఖజానా ఖాళీగా కనిపించడంతో వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. శాఖలవారీగా సమీక్షలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.ఆరున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టు అసెంబ్లీలో బయటపెట్టారు. ఎన్నికలు ముగియగానే డిసెంబర్ 9వ తేదీన సోనియాగాంధీ జన్మదినం రోజున రైతుభరోసా, రుణమాఫీ డబ్బు ఖాతాల్లో వేస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. తీరా ముఖ్యమంత్రి అయ్యాక వాటిపై ముందడుగు వేయలేదు.
బీఆరెస్ సర్కారు రైతు బంధు నిధులు ఖజానాలో ఉంచిందని భావించిన రేవంత్‌కు.. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వహించిన సమీక్షా సమావేశంలో కానీ అసలు సంగతి బోధపడలేదు. ఖజానా ఖాళీగా ఉన్నదని ఆర్థిక శాఖ అధికారులు సమాధానం ఇవ్వడంతో ఆశ్చర్యపోవడం రేవంత్ రెడ్డి వంతైంది. అయితే డిసెంబర్ 9వ తేదీన ఖాతాల్లో డబ్బులు పడకపోయినా, రైతుల రుణం మాఫీ కాకపోయినా ప్రజలు పరిస్థితి బాగా లేదు కాబట్టి వేయలేదని భావించారు. దీనిపై ఎక్కడ కూడా విమర్శలు రాలేదు. కానీ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుకు రోడ్ మ్యాప్ పడక పోతే మాత్రం వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ద్విముఖ వ్యూహంతో రేవంత్
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నారని స్పష్టమవుతున్నది. ఒకటి బీఆరెస్ చేసిన అప్పులను వెల్లడించడంతో పాటు బీఆరెస్ అధినేత కేసీఆర్‌తో, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, భూ కబ్జాలను బయట పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే లక్ష కోట్ల అవినీతి అంటూ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపైనే మొదటి విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన సహచర మంత్రులతో కలిసి మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించారు. అక్కడే ఈఎన్సీ చేత పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇప్పించారు.
18 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్‌లో కేవలం 90 వేల ఎకరాలకే సాగు నీళ్లు ఇస్తున్న వాస్తవం ఈ సందర్భంగా బయటపడింది. దీంతో కాళేశ్వరంపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. కాళేశ్వరం అక్రమాలపై జ్యుడిషియరీ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ విచారణ ద్వారా గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంటుంది. ఇలా విద్యుత్తు కుంభకోణాలపైనా విచారణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ధరణి అక్రమాలపై నిగ్గు తేలుస్తామన్న రేవంత్ రెడ్డి ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ధరణిని రద్దుచేసి, దాని స్థానంలో కొత్త వ్యవస్థను తీసుకు వచ్చే దిశగా అడుగులేస్తున్నారు.
తక్షణ ఆర్థిక భారం లేనివే తొలి రెండు గ్యారెంటీలు
గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టినంత మాత్రాన ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు నమ్మరని గుర్తించిన రేవంత్ రెడ్డి మొదటి రోజే ఆరు గ్యారెంటీల అమలుకు క్యాబినెట్లో ఆమోదం తీసుకున్నారు. ఆ వెంటనే ఇందులో ఆర్థికంగా వెంటనే బడ్జెట్‌పై భారం పడని మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపును వర్తింప చేశారు. మిగిలిన నాలుగు పథకాల అమలుకు శ్రీకారం చుట్టడం కోసం నెల రోజులలోపే దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టారు. గ్రామగ్రామానికీ ప్రజా పాలన పేరుతో రూ.500 గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు బిల్లు, రైతు భరోసా, వివిధ రకాల సామాజిక పెన్షన్లు, రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరించారు. దాదాపు కోటి వరకు దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఈ ధరఖాస్తులను పరిశీలించి, ఫైనల్ చేసి వెంటనే పథకాలను అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎస్ శాంతి కుమారి ఇప్పటికే ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి కావాలని ఆదేశించారు.
పార్లమెంటు షెడ్యూల్ లోపే నాలుగూ వస్తాయా?
ఫిబ్రవరి మొదటివారంలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సంకేతాలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈలోపే మిగిలిన నాలుగు గ్యారెంటీలనూ ప్రజలకు అందించాల్సి ఉన్నది. లేకుంటే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు మరోలా ఉండే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఏంచేసైనా సరే పథకాలు గ్రౌండింగ్ చేయాలన్న ధృఢ నిశ్చయంతో కాంగ్రెస్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల రోజుల పాలనలో రెండు పథకాలు అమలులోకి వచ్చినా.. మిగతా వాటికి దరఖాస్తులు స్వీకరించడంతో అమలు చేస్తారన్న భరోసా కలిగింది. కానీ షెడ్యూల్ వచ్చేలోగా అమలులోకి రాకపోతే ప్రజల నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.