27 ల‌క్ష‌ల మంది ఖాతాల్లో రైతు బంధు నిధులు జ‌మ‌

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు స్కీంకు సంబంధించి ఇప్పటివరకు 40 శాతం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు

27 ల‌క్ష‌ల మంది ఖాతాల్లో రైతు బంధు నిధులు జ‌మ‌
  • మిగిలిన రైతుల‌కు త్వ‌రిత గ‌తిన రైతు బంధు ఇవ్వండి
  • అధికారుల‌ను ఆదేశించిన వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు
  • సంక్రాంతి త‌రువాత వ్య‌వ‌సాయ శాఖ‌పై స‌మీక్ష‌

విధాత‌, హైద‌రాబాద్‌: రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జ‌మ చేస్తున్నామ‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు తెలిపారు. ఈ మేర‌కు శ‌నివారం స‌చివాల‌యంలో ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి ర‌ఘునంద‌న్‌రావుల‌తో రైతు బంధు నిధుల విడుద‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు 27 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జ‌మ చేశామ‌న్నారు.


అయితే యాసంగి వ‌రి సాగు ప‌నులు సాగుతున్నాయని, ఈ ప‌రిస్థితుల్లో రైతులకు పెట్టుబ‌డి డ‌బ్బులు అవ‌స‌రం అవుతాయ‌ని మంత్రి తెలిపారు. మిగిలిన రైతులంద‌రి ఖాతాల్లో వెంట‌నే రైతు బంధు డ‌బ్బులు జ‌మ చేయాల‌ని మంత్రి తుమ్మ‌ల అధికారుల‌ను ఆదేశించారు.


రోజువారీగా రైతు బంధు విడుద‌ల చేయాల‌న్న తుమ్మల నాగేశ్వ‌ర‌రావు సోమ‌వారం నుంచి నిధుల విడుద‌ల పెంచాల‌ని అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. రైతు బంధు అమ‌లుపై సంక్రాంతి త‌రువాత మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని మంత్రి తెలిపారు. తెలంగాణ రైతులు రైతు బంధుపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.