కేసీఆర్ హయాంలో నష్టాల్లోకి సింగరేణి
సింగరేణి కార్మికులు తెలంగాణ సెంటిమెంట్‌తో గతంలో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీజీబీకేఎస్ ను రెండుసార్లు గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపిస్తే.. టీజీబీకేఎస్ నమ్ముకున్న నాయకుడు కేసీఆర్

– గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
– బలమైన యూనియన్ గా ఏఐటీయూసీ
– కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: సింగరేణి కార్మికులు తెలంగాణ సెంటిమెంట్‌తో గతంలో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీజీబీకేఎస్ ను రెండుసార్లు గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపిస్తే.. టీజీబీకేఎస్ నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ సంస్థను అధ:పాతాళానికి తీసుకెళ్లారని కొత్తగూడెం ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావు విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీజీబీకేఎస్ యూనియన్ ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారిందని, అల్లకల్లోలంగా తయారైందని అన్నారు. గతంలో కేసీఆర్ సర్కారు కంపెనీలో కొత్త కొలువులు ఇప్పిస్తామని, కొత్త భూగర్భ గనులు తవ్విస్తానని ఆశలు పెట్టి సింగరేణి సంస్థను నిలువు దోపిడీ చేశారని ఆరోపించారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ మాత్రమే ప్రయత్నిస్తుందన్నారు.
గతంలో సైతం ఎన్నో త్యాగాలు చేసి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీనే కార్మికులు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలు, ట్రేడ్ యూనియన్ ఎన్నికలు వేరని ఆయన పేర్కొన్నారు. ప్రజాకంటక ప్రభుత్వాన్ని దించడానికి కాంగ్రెస్ పార్టీ తో సీపీఐ పొత్తు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కలిసి పోటీచేయాలనే నియమాలు ఏవీ లేవని తెలిపారు.
కాంగ్రెస్ మద్దతిస్తే తీసుకుంటామని, లేకుంటే సొంతంగా పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఈసందర్భంగా మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, తమ్మినేని వీరభద్రం, స్థానిక బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, మూడు డివిజన్ల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.