చాకలి గట్టుపై సోలార్ ప్యానల్స్ చోరీ.. విచారణ చేస్తున్నామంటున్న ఫారెస్ట్ అధికారులు
నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజనల్ పరిధిలో సాగర్ జలాశయం మధ్యలో ఉన్న చాకలి గట్టు ఐలాండ్‌పై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తు ప్యానల్స్ చోరీకి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

విధాత: నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజనల్ పరిధిలో సాగర్ జలాశయం మధ్యలో ఉన్న చాకలి గట్టు ఐలాండ్‌పై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్తు ప్యానల్స్ చోరీకి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ అటవీశాఖ పరిధిలో ఉన్నటువంటి చాకలి గట్టు ఐలాండ్ పై గతంలో నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజన్ అధికారులు 10కి పైగా కృష్ణ జింకలను వదిలారు. వీటితోపాటు నెమళ్లు, మనుబోతుల సంఖ్య కూడా ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ప్రస్తుతం 50 పైగా కృష్ణ జింకలు ఈ చాకలి గట్టుపై సంచరిస్తున్నాయి.
వీటి సంరక్షణ చర్యల్లో భాగంగా చాకలి గట్టుపై విద్యుత్తు సరఫరా కోసం లక్షల రూపాయల వ్యయంతో సోలార్ ప్యానల్స్ లను ఏర్పాటు చేశారు. అలాగే చాకలి గట్టుపై జంతువుల సంచారం సంరక్షణకై తమ సిబ్బందితో బేస్ క్యాంపు సైతం ఏర్పాటు చేశారు. కాగా గత కొన్ని రోజుల క్రితం చాకలి గట్టుపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్‌లో సుమారు 20 దాకా గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు చేరవేశారు. దీనిపై సంబంధిత స్థానిక అటవీశాఖ అధికారులను వివరణ కోరగా చాకలి గట్టుపై సోలార్ ప్యానల్స్ చోరీకి గురైన సంగతి నిజమేనని ఈ విషయంలో విచారణ చేస్తున్నామని తెలిపారు.
సాగర్ జలాశయంలో తెలంగాణ అటవీ శాఖ పరిధిలో ఉన్న చాకలి గట్టు ఐలాండ్ పై తెలంగాణ టూరిజం వారు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా టూరిజం స్పాట్‌గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పురోగతిలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో చాకలి గట్టు ఐలాండ్ పై అటవీ శాఖ లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ చోరీ అవడంపై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సోలార్ ప్యానల్స్ చోరీ నేపథ్యంలో చాకలి గట్టులో సంరక్షించబడుతున్నకృష్ణ జింకలు, నెమళ్లు, మిగతా జంతు జంతువుల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ సంఘటన జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.