Praja Bhavan | బాంబు బెదిరింపు కేసు నిందితుడి అరెస్టు
తెలంగాణ ప్రజాభవన్‌కు, నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని టాస్క్ఫోర్సు పోలీసులు 24గంటల్లో గుర్తించి అరెస్టు చేశారు

24గంటల్లోనే పట్టుకున్న పోలీసులు
విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రజాభవన్‌కు, నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని టాస్క్ఫోర్సు పోలీసులు 24గంటల్లో గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు గుంటూరుకు చెందిన రామకృష్ణగా పోలీసులు గుర్తించి అతన్ని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నిందితుడు రామకృష్ణ మంగళవారం పంజాగుట్ట ప్రజా భవన్ లో, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి టెర్రర్ సృష్టించాడు.
అయితే నిందితుడు భార్యతో గొడవ పడి మద్యానికి బానిసై భార్య ఇంటికి రావడం లేదన్న బాధలో అలా ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రజాభవన్‌లో, నాంపల్లి కోర్టులో బాంబు పెట్టామని నిందితుడు రామకృష్ణ డయల్ 100కు కాల్ చేసి బెదరింపులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ ప్రజాభవన్, నాంపల్లి కోర్టులో డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో విస్తృత తనిఖీ చేసి అవన్ని ఫేక్ కాల్‌గా నిర్ధారించారు. అనంతరం నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టి అతడిని అరెస్టు చేశారు.