తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు ఈసారి ఎన్నికల్లో బీఆరెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు చెప్పారు

(విధాత ప్రత్యేకం)

తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు ఈసారి ఎన్నికల్లో బీఆరెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు చెప్పారు. కాంగ్రెస్‌పార్టీకి అధికారం కట్టబెట్టారు. కొన్ని ఎగ్జిట్‌పోల్స్‌, కొందరు రాజకీయ విశ్లేషకుల హంగ్‌ తప్పదన్న అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తామని, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష బాధ్యతను నిర్వర్తిస్తామని బీఆరెస్‌ నాయకులు చెప్పారు.

ప్రజలు కూడా ఈసారి బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకోవడం వల్లే బీఆర్‌ఎస్‌కు కూడా 39 సీట్లు వచ్చాయని భావించవచ్చు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి కూడా పరోక్షంగా చిత్తశుద్ధితో పనిచేయాలనే సంకేతాలు ఇచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైన అనేక వర్గాల వారు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు.

కానీ రాష్ట్రంలో మూడు పార్టీల, ముగ్గురు నేతల వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ముందుగా బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ ప్రభుత్వం ఏడాది కాలం మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత కేసీఆరే సీఎం అన్నారు. బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా శ్రీహరి మాటలకు బలం చేకూర్చేవిధంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదిలోనే కుప్పకూలిపోతుందన్నారు. శ్రీహరి ఉద్దేశం ప్రకారం బీఆర్‌ఎస్‌కు 39, ఎంఐఎంకు 7, బీజేపీకి 8 మంది శాసనభ్యులున్నారు. వీరంతా కలిస్తే వారి బలం 54 కు చేరుతుంది.

అంటే ఇంకా మిగిలిన వారిని కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించేలా చూస్తామన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్‌ చాలాకాలంగానే కాదు ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్‌ఎస్‌, ఎంఐఎం బీజేపీ బీ టీంలు అని ఆరోపించింది. శ్రీహరి ఆ ఆరోపణలను నిజం చేయాలనుకుంటున్నారా? నిజానికి శ్రీహరి, రాజాసింగ్‌లు కాకుండా కొత్త ఎమ్మెల్యేలు ఎవరైనా అంటే ఇంత సీరియస్‌గా చర్చించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వారిద్దరూ ఒకే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడంపై ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తమౌతుంది.

ఎందుకంటే వారు వ్యక్తిగతమని అనుకున్నా వారిద్దరి కామెంట్లను బీఆర్‌ఎస్‌, బీజేపీ అధిష్ఠానాలు ఖండించకపోవడం గమనార్హం. గత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుమారు తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ల ద్వారా లేదా అధికార, విపక్ష పార్టీల్లో చీలిక తెచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్న ఉదంతాలున్నాయి. అందుకే ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వీరిద్దరే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా చాలామంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలకు చాలా ఆశలున్నాయి. తొమ్మిదిన్నరేళ్ల తమ వెతలు తీరుతాయని వారు అనుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రాజకీయాలను తొమ్మిదిన్నరేళ్లుగా చూసిన వాళ్లు ఈసారి ఆ రెండు పార్టీలను పక్కనపెట్టి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీతో అధికారం ఇచ్చారు. దాన్ని కాపాడుకోవాలి. ప్రజల ఆకాంక్షలను నిలబెట్టాలి. అంతేగాని ఫిరాయింపుల గురించి అధికారపార్టీలో ఉన్న సీనియర్‌ నేత మాట్లాడటం సరికాదు.

ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి తర్వాత బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన 12 మందిలో 9 మందిని ఓటర్లు ఓడగొట్టారు. ఫిరాయింపుల విషయంలో ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నదన్నది ఈసారి ఫలితాలు చూస్తేనే అర్థమౌతుంది. కాబట్టి ఇంకా ఫిరాయింపు రాజకీయాలే చేస్తామని ఎవరు అనుకున్నా ప్రజాగ్రహం తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే పౌరసంఘాలు ఫిరాయింపులకు పాల్పడితే ధర్నాలు చేపడుతామని హెచ్చరించాయి.

అంతేకాదు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి కేంద్రం ప్రయత్నించింది అన్న ఫౌం హౌజ్‌ ఉదంతంలోని ఎమ్మెల్యేలను కూడా ప్రజలు ఓడించిన విషయాన్ని గమనించాలి. ఉమ్మడి రాష్ట్రంలో 1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చి నాదెండ్ల భాస్కర్‌రావు గద్దెనెక్కినప్పుడు ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు రానివ్వలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం 2014లో రాజకీయ పునరేకీకరణ పేరుతో ఫిరాయింపులను ప్రోత్సహించినా ప్రజలు పట్టించుకోకుండా 2018లో తిరిగి పట్టంకట్టారు. ఎందుకంటే అప్పటికి ప్రజల ఆలోచనలు కొత్త రాష్ట్రం స్థిరపడాలి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలన్న ఉద్దేశమే.

అయితే.. 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రతిపక్షం లేకుండా చేయాలనే అధికార పార్టీ ప్రయత్నాలను ప్రజలు హర్షించలేదు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పేలా తీర్పు ఇచ్చారు. కరీంనగర్‌ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జీవన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. నాయకులు ప్రభుత్వాలను కూల్చేస్తాం అనే వ్యాఖ్యలు చేసే ముందు గత చరిత్ర గుర్తుంచుకుంటే మంచిదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Somu

Somu

Next Story