కారు.. కాంగ్రెస్.. కాషాయ పార్టీ.. ఏమిటా కథ!
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. ప్రధాన పార్టీల జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు.

- ఆ నాలుగు లోక్‌సభ సీట్ల పరిధిలో బీజేపీ ఫోకస్
- కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు తప్పదా?
(విధాత ప్రత్యేకం)
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. ప్రధాన పార్టీల జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. పోలింగ్‌కు ఇంకా 12 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈసారి ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది వివిధ సర్వేలు అంచనా వేశాయి. వాటి సంగతి పక్కనపెడితే ప్రధాన పోటీ బీఆరెస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందనేది చాలామంది వాదన. అంతేకాదు అధికారంలోకి వస్తామంటున్న బీజేపీకి అంతసీన్ లేదని, ఎంఐఎం కంటే తక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారు.
కానీ ఆ బీజేపీ వ్యూహాలు వేరేలా కనిపిస్తున్నాయి. కాషాయ పార్టీ పెద్దలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. వాళ్లు గెలుస్తారా? లేదా! అన్నది వేరే విషయం. కానీ కాంగ్రెస్, బీఆరెస్ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తారని వారు నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఒకవేళ త్రిముఖ పోరులో కొన్ని చోట్ల గెలుపొందినా ఆశ్చర్యపోనక్కరలేంటున్నారు. అలాగే అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లే వస్తాయనే వాదనలూ ఉన్నాయి. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో పరివార్‌కు సంబంధించిన ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, ఏబీవీపీ, యువమోర్చా నేతలు ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తున్నారని సమాచారం. వీళ్ల ఓటు బ్యాంక్ పెరిగితే అంతిమంగా అది ఎవరి నష్టం చేస్తుందో ఇప్పుడే చెప్పలేమని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పుడు బీజేపీ 2019లో గెలిచిన పార్లమెంటు పరిధిలోని నాలుగు స్థానాల గురించి చూద్దాం.
ఆదిలాబాద్
ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ సోయం బాపూరావు గత ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థిపై గోడం నగేశ్‌పై 58,560 ఓట్ల తేడాతో గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్‌లలో బీజేపీకి ఆధిక్యం వచ్చింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్, బోథ్, ముథోల్ నియోజకవర్గాల్లో బీఆరెస్, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా బలంగా ఉన్నప్పటికీ బీజేపీకి విజయావకాశాలు ఉంటాయని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో మెజారిటీ మార్క్‌ను చేరుకోవడం అంత తేలిక కాదంటున్నారు.
కరీంనగర్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లోక్‌సభ స్థానంలో బీఆరెస్ అభ్యర్థి బీ వినోద్‌కుమార్‌పై 89,508 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో కరీంనగర్‌తోపాటు, హుజురాబాద్‌లో ఆ పార్టీ బలంగానే ఉన్నది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉండటంతో ఈ రెండు స్థానాల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ముఖ్యంగా కరీంనగర్లో ఏ పార్టీ గెలిచినా స్వల్ప మెజారిటీతోనే బైటపడుతుందని అంటున్నారు. హుజురాబాద్‌లో బీఆరెస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉండనున్నదని ప్రచారణ సరళిని బట్టి చూస్తే తెలుస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నిజామాబాద్
ఇక బీజేపీ బలంగా ఉన్న మరో లోక్‌సభ స్థానం నిజామాబాద్. ఇక్కడ గత ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 70,875 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ లోక్‌సభ పరిధిలోని ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆరెస్‌కంటే ఎక్కువ మెజారిటీ సాధించింది. ఈసారి ధర్మపురి అర్వింద్ కోరుట్లలో, ఏలేటి అన్నపూర్ణమ్మ బాల్కొండలో, యెండల లక్ష్మీనారాయణ బాన్సువాడలో, బోగ శ్రావణి జగిత్యాలలో బీజేపీ బరిలో నిలిపింది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో కోరుట్లలో తప్పా మిగిలిన నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించేది బీజేపీ అభ్యర్థులేనని చెబుతున్నారు. ఈ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలను సైతం కొట్టిపారేయలేమని అంటున్నారు.
సికింద్రాబాద్
కేంద్రమంత్రి, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో బీఆరెస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్‌పై 612,114 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గ పరిధిలో ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఆధిక్యం లభించింది. ఈ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, అంబర్ పేట్ నుంచి మాజీ మంత్రి కృష్ణయాదవ్, ముషీరాబాద్ నుంచి పూస రాజు, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మేకల సారంగపాణి పోటీ చేస్తున్నారు.
ఈ నేతల్లో కృష్ణయాదవ్ టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. మొన్నటి దాకా బీఆరెస్‌లో ఉన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. సనత్ నగర్ ఎమ్మెల్యేగా కూడా గతంలో గెలిచారు. అర్బన్ ఓటు బ్యాంకు కొంత బీజేపీ అనుకూలంగా ఉంటుందనే వాదనలున్నాయి. ఈ లెక్కన 20-25 స్థానాల్లో త్రిముఖ పోరు తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి కారు- కాంగ్రెస్- కాషాయ పార్టీల మధ్య త్రిముఖ పోరు ఈసారి కీలకం కావడమే కాదు, ప్రభుత్వ ఏర్పాటులోనూ నిర్ణయాత్మకంగా మారే అవకాశాలు ఉన్నాయన్న చర్చలు నడుస్తున్నాయి.