కారు చివరి సీట్లు ఖరారు..! తొలి జాబితాలో మార్పులు?

కారు చివరి సీట్లు ఖరారు..! తొలి జాబితాలో మార్పులు?
  • కాంగ్రెస్‌, బీజేపీ వైపు అసమ్మ‌తి నేత‌లు
  • నాంప‌ల్లి స్థానం అత‌నికేనా?


విధాత‌, హైద‌రాబాద్‌: బీఆరెస్ పార్టీ మిగిలిన స్థానాల‌కు కూడా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలిసింది. ఈ మేర‌కు ఆయా అభ్య‌ర్థుల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేసుకోవాల‌ని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ శుక్ర‌వారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. డిసెంబ‌ర్‌లో జ‌రుగ‌నున్న‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆరెస్‌ అభ్య‌ర్థుల జాబితాను అంద‌రి కంటే చాలా ముందుగా పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌కటించారు. మిగిలిన పార్టీలేవీ ఇప్పటి వరకూ అభ్యర్థలను ప్రకటించలేదు. అంద‌రి కంటే ముందే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర‌లేపారు. బీఆరెస్‌ మొత్తం 119 స్థానాల‌కు గాను 114 స్థానాల అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. మిగతా ఐదు స్థానాల్లో ఎవ‌రిని ప్ర‌క‌టించ‌కుండా స‌స్పెన్స్‌లో పెట్టింది.



అయితే ఆ ఐదు స్థానాల్లో ఎవ‌రిని ప్ర‌క‌టిస్తారోని రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌లు బాగానే జ‌రుగుతున్నాయి. జ‌న‌గామ‌ సీటు త‌న‌కే కావాలని ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో అక్క‌డ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డికి ప‌ల్లాకు మ‌ధ్య కొన్నిరోజులుగా వార్ న‌డుస్తున్న‌ది. అయితే వారిని స‌ముదాయించేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. వారి మధ్య స‌యోధ్య కుదిరించే ప్ర‌య‌త్నం కూడా చేశారు. అయితే తాజాగా ఆ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కాద‌ని ప‌ల్లాకు కేటాయించారని సమాచారం. ఇక మెద‌క్ న‌ర్సాపూర్ స్థానంలో ఎమ్మెల్యే మ‌దన్ రెడ్డికి బదులు.. ఇటీవ‌లే కాంగ్రెస్‌ను వీడి కారెక్కిన సునీత ల‌క్ష్మారెడ్డికి కేటాయించారని తెలుస్తున్నది. మ‌ల్కాజిగిరిలో ఇంత‌కు ముందే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావును ప్ర‌క‌టించినా.. త‌న కుమారుడికి టికెట్ ఇవ్వ‌లేద‌నే కోపంతో ఉన్న ఆయన.. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే స‌మ‌క్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.



దీంతో ఆ స్థానంలో మంత్రి మ‌ల్లారెడ్డి అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి టికెట్ ఫైన‌ల్ చేశారని సమాచారం. మ‌రోవైపు గోషామ‌హ‌ల్‌లో బీఆరెస్ ఇన్‌చార్జిగా ఉన్న నంద‌కిశోర్ వ్యాస్‌కు ఇస్తున్నారని తెలుస్తున్నది. ఈ మేర‌కు వారివారి నియోజ‌కవ‌ర్గాల్లో ప్రచారం చేసుకునేందుకు సీఎం కేసీఆర్‌ ప‌చ్చ జెండా ఊపిన‌ట్లు చెబుతున్నారు. నాంప‌ల్లికి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేశాకే బీఆరెస్‌ అభ్యర్థిని ప్రకటిస్తారని సమాచారం. ఎందుకంటే గ‌తంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వ‌ల్ప ఓట్ల‌తో ఓట‌మి పాలైన ఫిరోజ్ ఖాన్‌కు ఈ సారి కాంగ్రెస్ నుంచి టికెట్ దొరుకుతుందా లేదా అన్న సందేహాలు రావ‌డంతో అత‌న్ని బీఆరెస్‌లో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.


తొలి జాబితాలో స్వల్ప మార్పులు!


తొలి జాబితాలో ప్ర‌క‌టించిన వాటిలో స్వల్ప మార్పులు చేయ‌ల‌నే ఆలోచ‌న‌లో పార్టీ అధినేత ఉన్నార‌ని జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి పేరునే అధిష్ఠానం తొలి జాబితాలో ప్ర‌క‌టించింది. ఈసారి త‌న‌కే టికెట్ రావాల‌ని ప్ర‌య‌త్నం చేసిన చిట్కుల్ స‌ర్పంచ్ నీలం మ‌ధు భంగ‌ప‌డ్డారు. దీంతో అస‌మ్మ‌తి గ‌ళం ఎత్తుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజుల ఓట్లు చాలా ఉన్నాయ‌ని, తమకు పార్టీలో త‌గిన ప్రాధాన్య‌ం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు ముదిరాజుల స‌మ్మేళ‌నాలు, స‌మావేశాలు, ర్యాలీలు భారీగా నిర్వ‌హిస్తున్నారు.


పార్టీ త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే రెబ‌ల్‌గా పోటీ చేస్తాన‌ని సంకేతాలు పంపుతున్నారు. అయితే పార్టీకి న‌ష్టం వాటిల్ల‌కుండా టికెట్ విష‌యంలో అధిష్ఠానం కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతుంద‌ని స‌మాచారం. అంబ‌ర్‌పేట్ స్థానంలో సైతం బీఆరెస్ అక్క‌డి ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్ పేరును ప్ర‌క‌టించింది. అయితే బీజేపీ నుంచి అంబ‌ర్‌పేట్ స్థానం ఆశించి భంగ‌ప‌డ్డ గ్రేట‌ర్ మాజీ అధ్య‌క్షుడు వెంక‌ట్ రెడ్డి ఆయ‌న స‌తీమ‌ణి, అంబ‌ర్‌పేట్ కార్పొరేటర్‌ ప‌ద్మా వెంక‌ట్ రెడ్డి బీఆరెస్‌లో చేరారు. అక్క‌డ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిని ఢీకొట్టాలంటే వెంక‌ట్ రెడ్డికి టికెట్ ఇవ్వ‌డ‌మే మేల‌నే ఆలోచ‌న‌లో బీఆరెస్ ఉన్న‌ట్లు స‌మాచారం.

బీజేపీ, కాంగ్రెస్ వైపు అసమ్మతి నేతలు..

బీఆరెస్‌లో టికెట్ ఆశించి భంగ ప‌డ్డ నేత‌లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైపు చూస్తున్నారు. అస‌మ్మ‌తి నేత‌ల‌కు త‌గిన ప్రాధాన్య‌ం ఇస్తూ టికెట్లు ప్ర‌క‌టిస్తామ‌ని భ‌రోసా ఏ పార్టీ ఇస్తే అందులో చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తున్నది. దీంతో కాంగ్రెస్‌, బీజేపీల్లో వారికి తెలిసిన నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారని సమాచారం. ఇదిలా ఉండ‌గా బీఆరెస్ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య‌నేత‌లకు గాలం వేస్తోంది. ఇటీవ‌లే ఆయా పార్టీలు నిర్వ‌హించిన స‌ర్వేల్లో, స్క్రీనింగ్ క‌మిటీలు తెలిపిన జాబితాల్లో పేర్లు లేవని తెలిసిన బ‌ల‌మైన నేత‌ల‌కు బీఆరెస్ ఎర వేస్తున్నదని అంటున్నారు.