V. Hanumantha Rao | కుల గణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి: వీహెచ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అధికారంలోకి వస్తే కులగణన చేపడుతామన్న హామీమేరకు ప్రతిపక్ష నేతగా పార్లమెంట్ లో బిల్లు పెట్టించాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు కోరారు

క్రీడలను ప్రొత్సహించాలి
సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎంపీ వీహెచ్ వినతి
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అధికారంలోకి వస్తే కులగణన చేపడుతామన్న హామీమేరకు ప్రతిపక్ష నేతగా పార్లమెంట్ లో బిల్లు పెట్టించాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు కోరారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వం చెప్పినట్లుగా కుల గణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని . సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి దేశంలో మంచి పేరు తెచ్చుకున్నాడని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తెలంగాణ ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేస్తున్నాడని అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు ఎక్కువ కాంగ్రెస్‌కు ఓటు వేశారని, అందుకే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందన్నారు.
కులగణన చేశాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాడని గుర్తు చేశారు. బీహార్‌లో నితీష్ కుమార్,తమిళనాడు లో స్టాలిన్ కులగణన చేస్తున్నారని, ఇక్కడ కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. గత బీఆరెస్ ప్రభుత్వం క్రీడాకారులను పట్టించుకోలేదని, తెలంగాణలో క్రీడలకు ప్రాధాన్యత తగ్గిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారులను, క్రీడలను ప్రొత్సహించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలలో క్రీడలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని, అన్ని జిల్లా కేంద్రాలలో, పట్టణ కేంద్రాల్లో క్రీడలకు ఐదు ఎకరాలు కేటాయించాలని, ఈ విషయం మీద సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని తెలిపారు