ధరణిపై త్వరలో మధ్యంతర నివేదిక
ధరణిలో భూమి సమస్యలపై అధ్యయనానికి గ్రామాలకు వెళ్లాలని ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయించింది

ధరణి సమస్యలపై అధ్యయనానికి
జిల్లాలకు వెళతాం.. గ్రామాల్లో పర్యటిస్తాం
మూడ్రోజుల్లో ఆరేడు జిల్లాల కలెక్టర్లతో భేటీ
తర్వాత డిప్యూటీ కలెక్టర్లు, ఎమ్మార్వోలతో
ప్రభుత్వ అనుమతి కోరుతున్నామన్న కమిటీ
ధరణిపై పకడ్బందీ చట్టం తెస్తామని వెల్లడి
విధాత, హైదరాబాద్: ధరణిలో భూమి సమస్యలపై అధ్యయనానికి గ్రామాలకు వెళ్లాలని ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయించింది. సోమవారం సీసీఎల్ఏ కార్యాలయంలో కమిటీ మూడవ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కమిటీ సభ్యులు కోదండరెడ్డి, రేమండ్ పీటర్, భూమి సునీల్, బీ మధుసూదన్, సీఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్ వీ లచ్చిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్వరలో మధ్యంతర నివేదిక ఇస్తామని వెల్లడించారు. కలెక్టర్లతోనూ, డిప్యూటీ కలెక్టర్లు, తాసిల్దార్లతోనూ సమావేశం నిర్వహిస్తామని కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని పేర్కొన్నది.
పకడ్బందీ చట్టం తేవాలి
చట్టంలో మార్పులు చేసి పకడ్బందీ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి అన్నారు. ధరణి చట్టం చేయడంలోనే లోపాలున్నాయన్నారు. ఈ చట్టంలో కలెక్టర్లకు అధికారం అంశంపై ఎక్కడా ప్రస్తావన లేదని చెప్పారు. రైతులకు భూముల హక్కలు విషయంలో గతంలో సమర్థవంతంగా పత్రాలు ఉన్నాయని గుర్తు చేశారు. 2014కు ముందు రెవెన్యూలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు కానీ హక్కుల విషయంలో రాలేదని చెప్పారు. ధరణిలో హక్కులు హరించి పోయాయని ఆరోపించారు. గత ప్రభుత్వం రైతులను చాలా ఇబ్బంది పెట్టిందన్న కోదండరెడ్డి.. చిన్న రైతులకు చాలామందికి రైతు బంధురాలేదు కానీ, వందల ఎకరాలున్నవారికి మాత్రం వచ్చిందని ఆరోపించారు. ధరణి సమస్యల కారణంగా చిన్న రైతులకు రుణాలు రాలేదన్నారు. ఒక పటిష్టమైన చట్టం తీసుకు వస్తామని తెలిపారు. ఈ ఆరేళ్లలో లక్షల మంది రైతులు హక్కులు లేక, ఆర్థిక సహాయం అందక ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్లతో సమావేశాలు
ధరణిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో పరిశీలించామని, రాబోయే మూడు రోజుల్లో ఎంపిక చేసిన ఆరేడు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని రేమండ్ పీటర్ తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సమావేశం కావడానికి ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని చెప్పారు. ఆర్డీఓలు, ఎమ్మార్వోలతో కూడా సమావేశం నిర్వహిస్తామన్నారు. కమిటీ నుంచి కొన్ని గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తామని, కొన్ని జిల్లాలకు కూడా వెళతామన్నారు. ధరణి సమస్యలపై సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారిని కూడా పిలిచి మాట్లాడుతామని చెప్పారు. భూమి సమస్యలకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు కూడా లింక్ ఉంటుందని, ఈ నేపథ్యంలో ఈ శాఖకు సంబంధించిన అంశాలపై కూడా పరిశీలిస్తామని రేమండ్ పీటర్ తెలిపారు. తమ కమిటీకి ప్రభుత్వం అప్పగించిన బాధ్యత మేరకు కమిటీ సభ్యులం ఒక అభిప్రాయానికి వచ్చి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని చెప్పారు. అయితే లాంగ్ టర్మ్, లీగల్ ఫ్రేమ్‌లో చేయాల్సినవి ఏమున్నాయనేది పరిశీలించి నివేదిక ఇస్తామని తెలిపారు. కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఎమ్మార్వోల సమావేశం ముగిసిన తరువాత మధ్యంతర నివేదిక ఇస్తామని చెప్పారు. ధరణిని పటిష్టం చేయడానికి డొమైన్స్‌లో ఉన్న సమస్యలేంటనేది పరిశీలిస్తున్నామన్నారు. అసైన్డ్ భూములు, ప్రొహిబిటెడ్ భూములు, వక్ఫ్, ఇనామ్, పట్టాదార్ పాస్ పుస్తకాలలో ఉన్న తప్పులు ఏవిధంగా ఉన్నాయనేది పరిశీలిస్తున్నామని తెలిపారు. ధరణితో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ క్రాప్ బుకింగ్ తదితర అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అటవీ భూములపై చాలా వర్క్ చేయాల్సి ఉందన్నారు.
ధరణి ప్రాసెస్ ఆగదు
కమిటీ వేసినంత మాత్రాన ధరణి ప్రాసెస్ ఆగదని, నడుస్తూనే ఉందని భూమి సునీల్ స్పష్టం చేశారు. కంప్యూటరీకరణ ద్వారా కొత్త సమస్యలు సృష్టించకూడదన్నారు. ధరణిలో వచ్చిన కొన్ని సమస్యల పరిష్కారానికి చట్టంలో మార్పులు ఏమైనా అవసరం కావచ్చని చెప్పారు. ధరణిపై చాలా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, కోర్టు తీర్పులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ధరణి ఒక్క రికార్డు ఎంత బాగా నిర్వహిస్తే అంత బాగా ఉంటుందని తెలిపారు. భూమి రికార్డులు, పరిపాలనపై క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తేనే తెలుస్తుందన్నారు. హక్కుదారుల పేర్లు రికార్డులో ఉంటేనే హక్కులున్నట్లని తెలిపారు.