ఓరుగల్లులో మెజారిటీ స్థానాల సెంటిమెంట్

ఓరుగల్లులో మెజారిటీ స్థానాల సెంటిమెంట్
  • అధిక స్థానాలొచ్చిన పార్టీకే రాష్ట్రంలో అధికారం
  • ఐదు ఎన్నికల ఫలితాల తీరు ఇదే
  • మిశ్రమ ఫలితాలకు వరంగల్ జిల్లా కేంద్రం
  • ప్రతిపక్షానికి కూడా స్థానం కల్పించారు
  • తెలంగాణకు ముందు.. తర్వాత ఇదే తీరు
  • ప్రజాప్రతినిధులే జంప్‌జిలానిలయ్యారు
  • తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫిరాయింపులు


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు ఏ పార్టీకి వస్తే, ఆ పార్టీకే రాష్ట్రంలో అధికారం లభించింది. గత ఐదు శాసనసభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. జిల్లాలో ఎక్కువ స్థానాలు లభించిన వారు రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్నప్పటికీ, జిల్లాలో మాత్రం ప్రతిపక్ష పార్టీలకు కూడా స్థానం కల్పిస్తూ వచ్చారు. ఏ ఎన్నిక చూసినా మిశ్రమ ఫలితాలనిచ్చింది. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే రాష్ట్రంలో అధికారం పొందిన పార్టీకి మెజారిటీ స్థానాలు కట్టబెట్టినప్పటికీ ప్రతిపక్షం పాత్ర కూడా ఉండాలని ఇక్కడి ప్రజలు భావిస్తూ వచ్చారు. అందుకే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా మిశ్రమ ఫలితాల వైపు మొగ్గు చూపారు.


తెలంగాణ ఏర్పాటు ముందూ.. తర్వాత


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుగానీ, తర్వాత గానీ శాసనసభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కాకుంటే తెలంగాణ ఆవిర్భావ అనంతరం ఎన్నికైన విపక్ష పార్టీల ప్రతినిధులు మాత్రం జంప్ జిలానిలుగా మారి, తమకు ఓటేసిన ప్రజలను కించపరిచారని చెప్పవచ్చు. అధికార పార్టీలోకి ఆగమేఘాల మీద చేరిపోయి, పదవులు పొంది అధికార అట్టహాసాన్ని అనుభవించడంలో ముందు వరుసలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.


2018లో 10 బీఆర్ఎస్, రెండు కాంగ్రెస్


2018 ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో పది స్థానాలను టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారు. రెండు స్థానాలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ రెండవసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్టేషన్ ఘన్పూర్ నుంచి డాక్టర్ తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్, వరంగల్ పశ్చిమ నుంచి దాస్యం వినయ్ భాస్కర్.


వరంగల్ తూర్పు నుంచి నన్నపునేని నరేందర్, డోర్నకల్ నుంచి డీఎస్ రెడ్యానాయక్, మానుకోట నుంచి బానోత్ శంకర్ నాయక్, నర్సంపేట నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకాల నుంచి చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ములుగు ఎమ్మెల్యేగా ధనసరి సీతక్క, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకట రమణారెడ్డి ఎన్నికయ్యారు. కానీ ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సీతక్క ఒక్కరే మిగిలిపోయారు.


2014లో 8 టీఆర్ఎస్, 2 టీడీపీ, 2 కాంగ్రెస్


తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 8 స్థానాలు లభించాయి. ప్రతిపక్ష పార్టీలకు నాలుగు స్థానాలు అందించారు. ఇందులో రెండు స్థానాలు టీడీపీకి, రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించగా, ఇందులో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా (కాంగ్రెస్ రెబల్గా) గెలుపొందారు. రాష్ట్రంలో తొలిసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.


టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ నుంచి డాక్టర్ తాటికొండ రాజయ్య, వరంగల్ పశ్చిమ నుంచి దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, మహబూబాబాద్ నుంచి బానోత్ శంకర్ నాయక్, వర్ధన్నపేట నుంచి ఆరూరి రమేష్, భూపాలపల్లి నుంచి సిరికొండ మధుసూదనాచారి, ములుగు నుంచి అజ్మీరా చందూలాల్ ఎన్నికయ్యారు.


టీడీపీ నుంచి పాలకుర్తి ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి డోర్నకల్ ఎమ్మెల్యేగా డీఎస్ రెడ్యానాయక్, స్వతంత్ర (కాంగ్రెస్ రెబల్) అభ్యర్థిగా నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగగా, ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డి, డీఎస్ రెడ్యా నాయక్ టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. దీంతో ప్రతిపక్షానికి ఒకే ఎమ్మెల్యేగా దొంతి మిగిలారు.


2009 ఎన్నికల్లో 7 కాంగ్రెస్, 4 టీడీపీ, 1 టీఆర్ఎస్


2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏడు స్థానాలు, టీడీపీకి నాలుగు స్థానాలు, టీఆర్ఎస్ కు ఒక స్థానం లభించాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా పొన్నాల లక్ష్మయ్య, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా డాక్టర్ తాటికొండ రాజయ్య, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యేగా కొండా సురేఖ, భూపాలపల్లి ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి, మానుకోట ఎమ్మెల్యేగా మాలోతు కవిత, వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఎన్నికయ్యారు. పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, డోర్నకల్ నుంచి సత్యవతి రాథోడ్, ములుగు నుంచి ధనసరి సీతక్క ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా దాస్యం వినయ్ భాస్కర్ ఎన్నికయ్యారు.


2004లో 6 టీఆర్ఎస్, 5 కాంగ్రెస్, 2 టీడీపీ


2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయగా 13 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలను కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకోగా, కేవలం 2 స్థానాలు మాత్రమే టీడీపీకి లభించాయి. ఇందులో కాంగ్రెస్ కి 5 స్థానాలు లభించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా పొన్నాల లక్ష్మయ్య, వరంగల్ ఎమ్మెల్యేగా బసవరాజ్ సారయ్య, శాయంపేట ఎమ్మెల్యేగా కొండా సురేఖ, డోర్నకల్ ఎమ్మెల్యేగా రెడ్యానాయక్, ములుగు నుంచి పోడెం వీరయ్య ఎన్నికయ్యారు.


అనూహ్యంగా టీఆర్ఎస్ ఆరు స్థానాలను దక్కించుకుంది. టీఆర్ఎస్ చేర్యాల ఎమ్మెల్యేగా కొమ్మూరి ప్రతాపరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా డాక్టర్ విజయ రామారావు, హనుమకొండ ఎమ్మెల్యేగా మందాటి సత్యనారాయణ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యేగా దుగ్యాల శ్రీనివాసరావు, పరకాల ఎమ్మెల్యేగా బండారి శారా రాణి, నర్సంపేట ఎమ్మెల్యేగా కే లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యేగా వేం నరేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 1999 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఆరు స్థానాలు, టీడీపీ ఆరు స్థానాలు గెలుపొందగా, బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చింది.