భూ సమస్యలకు పరిష్కారాలు.. సులభంగా.. వేగంగా..
భూ సమస్యలకు సులభంగా .. వేగంగా పరిష్కారాలు చూపుదామని ధరణి సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయపడింది

- షార్ట్‌టర్మ్.. మీడియం టర్మ్.. లాంగ్‌టర్మ్
- మూడు మార్గాల్లో సమస్యల పరిష్కారం
- 15 రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదిక!
- ఏమేమి చేయాలో జాబితా రూపకల్పన
- ధరణి పోర్టల్‌పై సీసీఎల్‌ఏ ప్రజంటేషన్
- 33 మాడ్యూల్స్‌పై నవీన్‌మిట్టల్ వివరణ
- ధరణి చట్టం అమలుకు నిబంధనలేవి?
- లేకుండా సమస్యలెలా పరిష్కరించారు?
- అధికారులను ప్రశ్నించిన కమిటీ సభ్యులు
- కమిటీ మూడో భేటీ 22న సీసీఎల్ఏ ఆఫీస్‌లో
- సోమవారం నుంచి అర్జీలు, సలహాల స్వీకరణ
విధాత, హైదరాబాద్: భూ సమస్యలకు.. సులభంగా, వేగంగా పరిష్కారాలు చూపుదామని ధరణి సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అభిప్రాయపడింది. ధరణి సమస్యలపై అంశాలవారీగా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని నిర్ణయించింది. రైతులు, భూ యజమానుల భూమి సమస్యలకు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్‌లో పరిష్కారం అయ్యేవాటిని గుర్తించాలని నిర్ణయించారు. సింపుల్‌గా అయ్యే పరిష్కారం ఆయ్యేవి ఏమిటి? సంక్లిష్టంగా ఉండేవి ఏమిటనేది పరిశీలించి, అందుకు తగిన విధంగా పరిష్కార మార్గాలు చూపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఒక్కో అంశంపై ప్రత్యేక నివేదికలు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. 15 రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నించాలని కమిటీ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే సమయంలో ధరణి చట్టం, చట్టం అమలు కోసం రూపొందించే నిబంధనలపై కూడా చర్చ జరిగింది. అయితే చట్టం వచ్చిన తరువాత చట్టం అమలు కోసం రూల్స్ రూపొందంచక పోవడంపై కమిటీ విస్మయం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రూల్సే లేకుండా ఏ విధంగా పనిచేశారన్న సందేహాలను కమిటీ సభ్యులు వ్యక్తం చేసినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ కమిటీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ సీసీఎల్ఏ రేమండ్ పీటర్, భూమి నిపుణులు భూమి సునీల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ బీ మధుసుదన్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, డిప్యూటీ కలెక్టర్, సీఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్ వీ లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఈ కమిటీ తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు సీసీఎల్ఏ కార్యాలయంలో భేటీ కావాలని నిర్ణయించింది. ఆ రోజు నుంచి సీసీఎల్ఏ కార్యాలయంలో భూమి సమస్యలపై అర్జీలతోపాటు సలహాలు, సూచనలు కూడా స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది.
33 మాడ్యూల్స్‌పై నవీన్ మిట్టల్ ప్రజంటేషన్
ధరణిపై సమగ్ర నివేదిక కావాలని మొదటి సమావేశంలో కోరిన మేరకు అధికారులు.. తగిన సమాచారాన్ని కమిటీకి అందించారు. అలాగే ధరణిలోని 33 మాడ్యూల్స్‌పై సీసీఎల్ఏ నవీన్ మిట్టల్.. కమిటీకి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారని సమాచారం. ప్రజంటేషన్ ఇస్తున్న సమయంలోనే ఒక్కో మాడ్యూల్‌పై వచ్చిన సమస్యలు ఏమిటి? ఎన్ని పరిష్కరించారు? ఎన్ని తిరస్కరించారు? పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయి? ఎందుకు ఉన్నాయి? అనే అంశాలపై కమిటీ సభ్యులు అధికారులను వివరణ కోరినట్టు తెలిసింది. దాదాపు 2 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సీసీఎల్ఏ కమిటీకి వివరించినట్లు సమాచారం.
అధికారాల వికేంద్రీకరణతోనే సులభ పరిష్కారాలు
సమస్యలు సులువుగా పరిష్కారం కావాలంటే అధికారాల వికేంద్రీకరణ జరగాలన్న దిశగా సమావేశంలో చర్చించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ దిశగా ముందుకు వెళ్లాలంటే ధరణి చట్టానికి సవరణ చేయాల్సిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు పేర్కొన్నాయి. ధరణి చట్టం వచ్చిన తరువాత రూల్స్ కూడా ఫ్రేమ్ చేయకపోవడంపై కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రూల్సే లేనప్పుడు ఏ విధంగా ధరణిలో వర్క్ చేశారన్న సందేహాలను కమిటీ సభ్యులు లేవనెత్తినట్లు సమాచారం. ముఖ్యంగా ధరణి సవరణ చట్టం, వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థల రద్దు తరువాత క్షేత్రస్థాయిలో భూ పరిపాలన, భూముల పర్యవేక్షణ తదితర అంశాలపై కూడా చర్చ జరిగిందని తెలిసింది. దీంతో ధరణి కోసం తీసుకు వచ్చిన చట్టంపైనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. పైగా అధికారాల కేంద్రీకరణ వల్ల అతి చిన్న సమస్యలు కూడా జటిలంగా మారిన తీరుపై చర్చించారని సమాచారం. ముఖ్యంగా ఈ సమావేశంలో మిస్సింగ్ సర్వే నంబర్లు, వైవాటీ కబ్జాలు, ఒక సర్వే నంబర్‌కు బదులుగా మరో సర్వే నంబర్ రావడం, ఒక సర్వే నంబర్‌లో ఒక భాగానికి మాత్రమే నిషేధిత ఉత్తర్వులు ఉంటే మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం, పట్టా భూములు నిషేధిత జాబితాలో ఉండటం, పట్టా భూములు ప్రభుత్వ భూములుగా, అసైన్డ్ భూములుగా చేరడం, నాలా కన్వర్షన్ అయిన తరువాత కూడా వ్యవసాయ భూములుగా కనిపించటం, ఏ కారణం చేతనైనా భూమి రిజిస్ట్రేషన్ కాకుండా స్లాట్ రద్దు చేసుకుంటే రిజిస్ట్రేషన్ చార్జీల డబ్బులు వాపస్ ఇవ్వక పోవటం, అసైన్డ్ భూములు, గిరిజనుల పోడు పట్టా భూములకు వారసత్వ మ్యుటేషన్లు చేయకపోవటం, అసైన్డ్ భూములను ప్రభుత్వ భూములుగా రికార్డ్‌లలో చూపటం తదితర 33 రకాల సమస్యలను ఈ కమిటీ గుర్తించింది. ఇలా గుర్తించిన సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి? అందుకు అనుసరించాల్సిన విధానాలు ఏమిటన్న దానిపై కమిటీ ప్రభుత్వానికి వరుసగా నివేదికలు ఇవ్వనున్నదని అధికారవర్గాలు తెలిపాయి. ఈ మేరకు కమిటీ సమావేశం తరువాత సభ్యుడు కోదండరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ధరణిలో అనేక సమస్యలున్నాయని గుర్తించామని తెలిపారు. మొదటి సమావేశంలో కమిటీ అడిగిన సమాచారాన్ని సీసీఎల్ఏ కమిటీ ముందుంచిందని భూమి సునీల్ చెప్పారు. మీడియా సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ లచ్చిరెడ్డి కూడా ఉన్నారు.