ప్రవళికది.. సర్కారు హత్యనే: వైఎస్ షర్మిల

విధాత : గ్రూప్ 2 అభ్యర్ధి ప్రవళిక ఆత్మహత్యకు బీఆరెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆమెది ఆత్మహత్య కాదని, సర్కారు చేసిన హత్య అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్యపై షర్మిల ట్వీట్టర్ వేదిగా స్పందిస్తూ ఉద్యోగాలు లేక ప్రవల్లిక లాంటి అమ్మాయి ఉరి వేసుకొని బలవన్మరనానికి పాల్పడుతుంటే.. కేసీఆర్ ను చూసి ఓటెయ్యండని ఎలా అడుగుతున్నారు కేటీఆర్ గారు? అంటూ ప్రశ్నించారు. ఉద్యోగం సాధించి వస్తానమ్మా అని పట్నం వెళ్లిన బిడ్డ విగతజీవిగా వస్తే ఆ తల్లిదండ్రుల గుండె కోత ఎలా ఉంటుందో తెలుసా మీకు? అని నిలదీశారు. నష్ట జాతకురాలు ప్రవల్లిక కాదు.. అన్ని అధికారాలున్నా నిరుద్యోగుల కోసం ఏం చేయలేని పాలకులు నష్ట జాతకులని ఫైర్ అయ్యారు.

ఉద్యోగాలకు సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వడం చేతకాలేదు.. ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించడం చేతకాలేదని, ఏం చూసి మిమ్మల్ని మళ్లీ ఎన్నుకోవాలి? ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేసినందుకా.. నిరుద్యోగ భృతి అని దొంగ హామీ ఇచ్చినందుకా.. అంగట్లో సరుకుల్లా టీఎస్సీపీఎస్సీ పేపర్లు అమ్ముకున్నందుకా అని ప్రశ్నించారు. పేపర్ లీకులు, పరీక్ష వాయిదాలు, కేసులు, కోర్టులు.. మీ పాలనలో నిరుద్యోగుల దుస్థితి ఇదని మండిపడ్డారు. గద్దెనెక్కిన నాటి నుంచి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఉద్యోగం లేక ప్రాణాలు తీసుకుంటున్న చెట్టంత బిడ్డలని కోల్పోతున్న ఆ తల్లిదండ్రుల ఉసురు మీకు, మీ సర్కార్ కు తగలక మానదని షర్మిలా ఘాటుగా విమర్శించారు.
బతుకమ్మ ఆడిన షర్మిల
షర్మిల తన నివాసం లోటస్ పాండ్ వద్ధ జరిగిన బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. స్వయంగా బతుకమ్మను పేర్చి ఆటపాటల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల నా అక్కాచెళ్లెల్లందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు పువ్వులనే దేవతగా మలిచి పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అని, ఆ బతుకమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
