Fine Quality Rice | రేవంత్ సర్కార్ తెచ్చిన సన్నబువ్వ పథకం సూపర్ సక్సెస్
అందరూ సన్నబియ్యం అన్నం తింటుంటే.. రేషన్ షాపుల్లో మాత్రం దొడ్డుబియ్యం అందిస్తూ వచ్చాయి వరుస ప్రభుత్వాలు. అయితే.. ఈ పథకం పేదలకు ఉపయోగపడటం లేదని గుర్తించిన రేవంత్రెడ్డి ప్రభుత్వం.. దాని స్థానంలో సన్నబియ్యం పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ఇప్పుడు సూపర్ సక్సెస్ అయింది.

- లబ్ధిదారుల్లో 80 శాతానికిపైగా వినియోగం
- దుర్వినియోగం తగ్గిందంటున్న సర్కార్
- మార్కెట్లో పడిపోయిన ‘సన్న’ ధరలు
- ఇచ్చామా.. పుచ్చుకున్నామా.. అన్నట్టు
నాటి ప్రభుత్వాల దొడ్డు బియ్యం పంపిణీ - వాటిని పది, ఇరవైకి అమ్మిన లబ్ధిదారులు
- ఇదే అదనుగా రెచ్చిపోయిన మిల్లింగ్ మాఫియా
- ప్రజలకు ఉపయోగం లేదు.. సర్కారుక భారం
- ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన రేవంత్
- అదనంగా 2,800 కోట్లతో నూతన విధానం
- దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం
- సాలీనా వ్యయం.. రూ.13,522 కోట్లు
- 17,256 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ
హైదరాబాద్, మే 14 (విధాత ప్రత్యేకం)
Fine Quality Rice | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సన్న బియ్యం (Fine Quality Rice) ఉచిత పంపిణీ పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. బియ్యం తీసుకున్న ప్రతి కుటుంబం సంబురంగా తింటున్నది. గత రెండు మూడు దశాబ్దాలుగా ‘పేదలకు దొడ్డు బియ్యం ఇస్తున్నాం, వారు తీసుకుంటున్నారు’ అన్నట్టు ఏదో మొక్కుబడిగా ఈ పథకం కొనసాగుతూ వచ్చింది. దొడ్డు బియ్యం స్థానే సన్న బియ్యం పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. విజయవంతమైన ఈ కార్యక్రమానికి ప్రభుత్వం అదనంగా రూ.2,800 కోట్లు వెచ్చిస్తున్నది.
లక్ష్యం దారిమళ్లిన దొడ్డు బియ్యం పథకం
రాష్ట్ర ప్రభుత్వం సాలీనా రూ.10,665 కోట్లు వెచ్చించి 17,256 రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నది. సమాజంలో ప్రతి ఒక్కరూ వరి అన్నం తినాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రూ.2కు కిలో బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఈ పథకానికి జనం జేజేలు పలికారు. ఆ తరువాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయకుండా మొక్కుబడిగానే కొనసాగించారు. గత యూపీఏ ప్రభుత్వం తొలుత రూ.1 కే కిలో బియ్యం, అనంతరం ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేస్తున్న దొడ్డు బియ్యం పథకం ప్రభుత్వానికి భారంగా మారడంతోపాటు, దళారులకు, పౌర సరఫరాల అధికారులకు ఆదాయ వనరుగా తయారైంది. రేషన్ దుకాణాలలో కార్డుదారులు ఉచితంగా వస్తుందని తీసుకుని వెళ్లి, కిలోకు రూ.10, 20 చొప్పున బహిరంగ మార్కెట్లో అమ్మేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ బియ్యాన్ని కోళ్ల ఫారాలు, లిక్కర్ కంపెనీలు, హోటళ్లు విరివిగా ఉపయోగించుకునేవి. దొడ్డు బియ్యం తక్కువ ధరకు లభ్యం కావడంతో రైస్ మిల్లర్లు రేషన్ దుకాణ యజమానుల నుంచి కొనుగోలు చేసి రీ సైక్లింగ్ చేసేవారు. రీ సైక్లింగ్ ద్వారా వచ్చిన సన్న బియ్యాన్ని కిరాణా దుకాణాలు, రైస్ దుకాణాలకు విక్రయించేవారు. ప్రజలు కూడా సన్న బియ్యం అని భ్రమపడి కొనుగోలు చేశారు. పౌర సరఫరాల విభాగం పెద్దలు, రైస్ మిల్లర్ల మాఫియా చేతులు కలిపి దొడ్డు బియ్యం దందాలు సాగించారు. ఈ దందాలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుండేవి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖలో ఒక పెద్దాయనకు దోచుకునేందుకు దారి చూపించారనే విమర్శలు ఉన్నాయి. ఈ శాఖ ద్వారా ఆయన వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని, తన మాట వినని ఒక కమిషనర్ ను బదిలీ చేశారనే టాక్ ఉంది.
సమీక్షించి, తీరు మార్చేసిన కాంగ్రెస్ సర్కార్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ అవుతున్న దొడ్డు బియ్యం పంపిణీ, దుర్వినియోగం, సాలీనా చేస్తున్న వ్యయం పై సమీక్షించుకున్నది. రైతు కల్లం నుంచి వడ్లు కొనుగోలు మొదలు రేషన్ దుకాణంలో లబ్ధిదారుడికి పంపిణీ చేసే వరకు అవుతున్న వ్యయం ఎంత అనేది లెక్కలు తీశారు. చేస్తున్న ఖర్చు, ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించి, అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయం సేకరించింది. ప్రతి కిలో దొడ్డు బియ్యంపై రూ.37 ఖర్చు పెడుతుండగా, లబ్ధిదారుడు ఆ బియ్యం తీసుకుని బహిరంగ మార్కెట్ లో రూ.10 నుంచి రూ.15 మధ్య విక్రయిస్తున్నారని తేలింది. ఎందుకు వండుకుని తినడం లేదని ఆరా తీస్తే, దొడ్డు బియ్యం ఇష్టం లేకనే అని తేలింది. ఈ బియ్యం రీ సైక్లింగ్ చేసి సన్న బియ్యం పేరుతో మిల్లర్లు దందా చేస్తున్నారని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ఉచిత దొడ్డు బియ్యం పథకం కోసం ప్రతి సంవత్సరం రూ.10,665 కోట్లు వెచ్చిస్తున్నది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నా ప్రయోజనం నెరవేరకపోవడం, ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఉచితంగా లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తే ఎంత మొత్తం వెచ్చించాలని లెక్కలు వేయగా, రూ.13,522 కోట్లు అవుతుందని స్పష్టత వచ్చింది. అదనంగా అయ్యే వ్యయాన్ని భరించి పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈ ఏడాది ప్రారంభంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం రూ.5,489 కోట్లు భరిస్తుండగా, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతున్నది. రూ.2,800 కోట్ల అదనపు భారంతో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూ.8,033 కోట్లకు పెరిగింది. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు ఒక పండుగ కార్యక్రమం మాదిరి నిర్వహించారు. ఈ పథకం మూలంగా బహిరంగ మార్కెట్ లో ఒక కిలో సన్న బియ్యం పై రూ.15 నుంచి రూ.20 దాకా తగ్గడం ఆహ్వానించదగిన పరిణామం. మున్ముందు మరింతగా తగ్గవచ్చని పౌర సరఫరాల అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్కడ కూడా రేషన్ దుకాణాలలో నిల్వ ఉండడం లేదని, బియ్యం వచ్చిందని తెలియగానే లబ్ధిదారులు క్యూల్ నిలబడి తీసుకుని వెళ్తున్నారన్నారు. ఉచితంగా ఇస్తున్నారని బహిరంగంగా ఎక్కడా విక్రయించకుండా, వండుకుని తింటున్నారని ఒక అధికారి తెలిపారు. సుమారు 80 శాతం మంది లబ్ధిదారులు వండుకుంటున్నారన్నారు. అన్నపూర్ణ అంత్యోదయ, ఫుడ్ సెక్యురిటీ కార్డు (రేషన్ కార్డులు), అన్నపూర్ణ లబ్ధిదారులు మొత్తం 29356296 మంది ఉండగా ప్రతి నెలా 186127863 కిలోలు (1.86 లక్షల మెట్రిక్ టన్నులు) ఉచిత సన్న బియ్యం 17,256 రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Vidyut Soudha | విద్యుత్తు శాఖలో డైరెక్టర్లు లేకుండా 3 వేల కోట్ల కొనుగోళ్లు!.. భారీగా కమీషన్లు?
Cobra Dry Bites | కోబ్రా కాట్లన్నీ విషపూరితమేనా? వాటి విషం, పొడి కాట్ల వెనుక రహస్యాలేంటి?
Mars Curiosity Rover | అంగారకుడి మీద జీవంపై కొత్త క్లూ! వింత నిర్మాణాల గుర్తింపు!
Smart Ration cards | తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇంకెప్పుడు? అప్ డేట్ ఏమిటి?