రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే వెల్లడించింది

  • ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లో అంచనా వేసిన ఇండియా టుడే

TDP | న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే వెల్లడించింది. ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను టీడీపీకి 17 సీట్లు లభిస్తాయని అంచనా వేసింది. అధికార వైఎస్సార్సీపీ 8 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం లోక్‌సభ స్థానాల్లోని 35,801 మంది అభిప్రాయాలను తీసుకుని ఈ సర్వే అంచనాలు రూపొందించారు. 2023డిసెంబర్‌ 15, 2024 జనవరి 28 మధ్య ఈ సర్వే నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఇక్కడ ఒక్క స్థానం కూడా లభించే అవకాశం లేదని సర్వే వెల్లడించింది.

అయితే.. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు.. మరో ప్రతిపక్ష నేత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నారు. మరోవైపు బీజేపీతో కూడా పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన ఎన్డీయేలో చేరిన పక్షంలో ఈ సీట్లు ఎన్డీయే కోటాకింద పరిగణించాల్సి ఉంటుంది. అదే విధంగా కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఇండియా కూటమికి కూడా ఇక్కడ ఒక్క సీటు కూడా లభించే అవకాశాలు లేవని మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే వెల్లడించింది.

అధికార వైఎస్సార్సీపీకి 41 శాతం ఓటు షేరు లభించే అవకాశం ఉన్నదని అంచనా వేసిన సర్వే.. టీడీపీకి 45 శాతం ఓట్లు లభిస్తాయని పేర్కొన్నది. ఎన్డీయే, ఇండియా కూటములకు వరుసగా 2, 3 శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సంచలనాత్మకంగా 22 సీట్లలో విజయం సాధించింది. వైసీపీ ఫ్యాన్‌ గాలి తీవ్రతకు టీడీపీ మూడు స్థానాలు మాత్రమే గెల్చుకోగలిగింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేక పోయాయి.

Somu

Somu

Next Story