Telangana | తెలంగాణ ఎన్నిక‌లు.. నాలుగు రోజుల్లోనే రూ. 37 కోట్లు స్వాధీనం

Telangana | తెలంగాణ ఎన్నిక‌లు.. నాలుగు రోజుల్లోనే రూ. 37 కోట్లు స్వాధీనం

Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైన రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల‌వుతోంది. ఆ రోజు నుంచే పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. అంత‌ర్ రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న న‌గ‌దు, మ‌ద్యం, ఇత‌ర వ‌స్తువుల‌పై పోలీసులు నిఘా పెట్టారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నాలుగు రోజుల్లోనే రాష్ట్రంలో రూ. 37.07 కోట్ల విలువైన న‌గ‌దు, ఇత‌ర వ‌స్తువుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ముఖ్య ఎన్నిక‌ల అధికారి కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌నలో తెలిపింది. గురువారం సాయంత్రం వ‌ర‌కు రూ. 20.43 కోట్ల న‌గ‌దు, రూ. 14.66 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, రూ. 89 ల‌క్ష‌ల విలువ చేసే డ్ర‌గ్స్, రూ. 87 ల‌క్ష‌ల విలువైన మ‌ద్యం నిల్వ‌లు, పంపిణీకి సిద్ధంగా ఉంచిన రూ. 22.51 ల‌క్ష‌ల విలువ చేసే వ‌స్తువుల‌ను సీజ్ చేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది.

అయితే 2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌నిఖీల్లో మొత్తం రూ. 98 కోట్ల విలువైన న‌గ‌దు, బంగారం, మ‌ద్యం త‌దిత‌రాల‌ను స్వాధీనం చేసుకోగా, ఈసారి నాలుగు రోజుల్లోనే అందులో మూడో వంతు స్వాధీనం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక ఎన్నిక‌లు ముగిసే నాటికి.. ఎన్ని కోట్ల రూపాయాలు ప‌ట్టుబ‌డుతాయో.

అంత‌ర్ రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో 89, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 169 చెక్‌పోస్టుల‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1476 త‌నిఖీ బృందాలు ప‌ని చేస్తున్నాయి. ఇందులో ఫ్ల‌యింగ్ స్క్వాడ్లు 373, వివిధ ప్రాంతాల్లో కేంద్రీకృత‌మైన బృందాలు 374, త‌క్ష‌ణం స్పందించే బృందాలు 729 ఉన్న‌ట్లు సీఈవో కార్యాల‌యం తెలిపింది. ఇక ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా 1,196 మందిపై కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు పేర్కొంది. ఎన్నిక‌ల బందోబ‌స్తు కోసం వంద కంపెనీల సీఏపీఎఫ్ బ‌ల‌గాలను కేటాయించింది. ఒక్కో కంపెనీలో 80 మంది సాయుధ పోలీసులు ఉంటారు. అంటే మొత్తంగా రాష్ట్రానికి 8 వేల మందిని కేటాయించారు. ఈ నెల 20వ తేదీన సాయుధ బ‌ల‌గాలు రాష్ట్రానికి చేరుకోనున్నాయి.