ఎడ్విన్‌కు బెయిల్.. పోలీసు ఉన్న‌తాధికారుల విస్మ‌యం..!

డ్ర‌గ్స్ దిగుమ‌తిలో కీల‌క సూత్ర‌ధారి సోనాలి ఫొగ‌ట్ మృతి కేసులో ప్ర‌ధాన నిందితుడు 3 నెలలు శ్ర‌మించి అరెస్టు.. అయినా బెయిల్‌పై విడుద‌ల..! విధాత : ఎడ్విన్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేసి, ఆస్తులు జప్తు చేసే పనిలో ఉండగానే ఆయనకు బెయిల్‌ లభించడంతో పోలీసులు ఖంగు తిన్నారు. ఎడ్విన్‌ను ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు నమోదైతే నెలల తరబడి జైలుకే పరిమితం కావాల్సి వస్తుంది. అయితే అరెస్టు అయిన కీలక […]

ఎడ్విన్‌కు బెయిల్.. పోలీసు ఉన్న‌తాధికారుల విస్మ‌యం..!
  • డ్ర‌గ్స్ దిగుమ‌తిలో కీల‌క సూత్ర‌ధారి
  • సోనాలి ఫొగ‌ట్ మృతి కేసులో ప్ర‌ధాన నిందితుడు
  • 3 నెలలు శ్ర‌మించి అరెస్టు.. అయినా బెయిల్‌పై విడుద‌ల..!

విధాత : ఎడ్విన్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేసి, ఆస్తులు జప్తు చేసే పనిలో ఉండగానే ఆయనకు బెయిల్‌ లభించడంతో పోలీసులు ఖంగు తిన్నారు. ఎడ్విన్‌ను ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు నమోదైతే నెలల తరబడి జైలుకే పరిమితం కావాల్సి వస్తుంది. అయితే అరెస్టు అయిన కీలక నిందితుడు రోజుల వ్యవధిలోనే విడుదల కావడం కలకలం రేపుతున్నది.

గోవా కేంద్రంగా హైదరాబాద్‌కు కొకైన్‌, హెరాయిన్‌, డీఎంఏ వంటి మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎడ్విన్‌ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. యువతను మత్తుకు బానిస కాకుండా కాపాడే ఉద్దేశంతో హైదరాబాద్‌ పోలీసులు చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలోనే నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ పేరిట ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందాలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని తార్నాకలోని ప్రీతీష్‌ బోర్కర్‌ అనే గోవా డ్రగ్స్‌ స్మగ్లర్‌ను పట్టుకోగా డ్రగ్స్‌ వ్యవహారం మొత్తం బైటికి వచ్చింది. అయితే ఎడ్విన్‌కు బెయిల్ రావడంతో హెచ్‌-న్యూ పోలీస్‌ బృందానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

గోవాలో మత్తు దందా చేస్తున్నడిసౌజా అనే స్మగ్లర్లను పట్టుకున్నారు. అతనితో సంబంధం ఉన్న తెలంగాణ, ఏపీ రాష్ట్రానికి చెందిన దాదాపు 600 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే మత్తు దందాలో కీలకంగా ఉన్న ఎడ్విన్‌ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కలకలం రేపిన గోవా కర్లీస్‌ షాప్‌ రెస్టారెంట్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన బీజేపీ నాయకురాలు సోనాలి ఫొగట్‌ కేసులో ఎడ్విన్‌ నిందితుడిగా ఉన్నాడు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసు విభాగానికి దొరకకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు. ఆ డ్రగ్స్‌ సూత్రధారిని పట్టుకోవడానికి పోలీసులు న్యాయస్థానాలను ఆశ్రయించి ఈ నెల 5వ తేదీన గోవా నుంచి హైదరాబాద్‌కు పట్టుకొచ్చారు. అలాంటి వ్యక్తికి బెయిల్ రావ‌డంపై పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.

ఎడ్విన్‌పై హైదరాబాద్‌ రాంగోపాల్‌పేట్‌, ఉస్మానియా యూనివర్సిటీ, లాలాగూడ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు గోవాలో మూడు నెలల పాటు ఆపరేషన్‌ నిర్వహించారు. చివ‌ర‌కు రాంగోపాల్‌పేట్‌ పీఎస్‌ కేసులో ఈ నెల 5న అరెస్టు చేశారు.

అంతకు ముందే మరో రెండు కేసుల్లో ఎడ్విన్‌ ఇప్పటికే ముందస్తు బెయిల్‌ పొందారు. బెయిల్‌ పై ఎడ్విన్‌ విడుదల కావడం పోలీస్‌ ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదైనా బెయిల్‌ ఎలా లభించిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.