ముందు కాంగ్రెస్ పార్టీ గెలవనీయండి.. సీఎం సంగతి తర్వాత!

సోనియాగాంధీ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారని నల్గొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ముందు కాంగ్రెస్ పార్టీ గెలవనీయండి.. సీఎం సంగతి తర్వాత!
  • కోమటిరెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లలో చర్చ
  • కీలక సమయంలోనూ అధికార యావే
  • ఇప్పటికే దీనిపై టర్గెట్‌ చేస్తున్న బీఆరెస్‌
  • కాంగ్రెస్‌లో డజన్‌ సీఎంలన్న కేసీఆర్‌
  • రుజువు చేసుకుంటున్న నాయకులు
  • పీఠంపై ఆశేనా? గెలవడానికి పాచికా?

విధాత: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, సోనియాగాంధీ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారని, పార్టీలో తనకంటే సీనియర్లు ఎవరూ లేరని భువనగిరి ఎంపీ, నల్గొండ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయ పరిశీలకుల్లోనూ చర్చను రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో సీఎం అభ్యర్థుల జాబితా పెద్దగానే ఉన్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆరెస్‌ నాయకులు తరచూ ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌లో డజన్‌మందికిపైగానే సీఎంలు ఉన్నారని ఎద్దేవా చేస్తుంటారు. నాయకుల తరహా కూడా ముందు పార్టీ గెలవడంకంటే.. గెలిచిన తర్వాత వచ్చే ముఖ్యమంత్రి పీఠం గురించే ఆశల్లో ఉన్నట్టు కనిపిస్తున్నది.


కాంగ్రెస్‌లో ఎవరు సీఎం కావాలన్నది సీఎల్పీ భేటీలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అంతేకాదు ఒకవేళ పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా అందరినీ కలుపుకొనిపోయే వారికే ఆ అవకాశం ఇవ్వొచ్చు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా అధిష్ఠానం పెద్దగా పరిగణనలోకి తీసుకోదు. అంతిమంగా తాము అనుకున్నదే ప్రతిపాదించి.. ఆమోద ముద్ర వేయించుకుంటుంది. ఉదాహరణకు ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్టీ సీనియర్‌ నేతలు చాలామంది సీఎం సీటు కోసం పోటీ పడ్డారు. అందరి అభిప్రాయాలనూ గౌరవిస్తూనే.. తన నిర్ణయం తాను తీసుకున్నది. ప్రస్తుతం పార్టీ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నందున అప్పటివరకు సహనంతో ఉండాలని సర్దిచెప్పి పార్టీ విధేయులు, సీనియారిటీ, అందరినీ సమన్వయం చేయగల సామర్థ్యం ఉన్నవారికే పదవులు కట్టబెట్టింది. కర్ణాటకలో సిద్ధరామయ్య, హిమాచల్‌ప్రదేశ్‌లో సిఖ్విందర్‌సింగ్‌లకు అవకాశం అలాగే వచ్చిన విషయం విదితమే.


తెలంగాణ విషయానికి వస్తే రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ లాంటి నేతలు ఇప్పటికే తాము సీఎం రేసులో ఉన్నామన్నారు. అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేయడానికి దీన్ని ఒక అస్త్రంగా వాడుకోవడం కారణమై ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వాళ్లు పోటీ చేస్తున్న నియోజకవర్గ ఓటర్లను ఆకట్టుకోవడానికి, తమ గెలుపు అవకాశాలను సులభం చేసుకోవడానికి ఈ నినాదాన్ని ఎత్తుకున్నారని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మొగ్గు ఉంటుందని, అదే సమయంలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్న సమయంలో ప్రతి సీటు గెలువడం ప్రధాన పార్టీలకు పెద్ద టాస్క్‌గా మారింది. అందుకే ఏ ఒక్క అవకాశాన్నీ నేతలు వదులుకోవడం లేదు. సీఎం రేసులో తాము ఉన్నామంటున్న నేతలంతా ఆయా నియోజకవర్గాల్లో పట్టున్నవారు. కానీ ప్రత్యర్థులు కూడా బలంగా ఉన్నచోట్ల త్రిముఖ పోరు లేదా హోరాహోరీ పోరు తప్పనిసరి అయినప్పుడు తటస్థంగా ఉండే ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నంగా కూడా పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


‘కాంగ్రెస్‌ పార్టీలో ఎవరికి వారే నేనే సీఎం అంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు నేనే సీఎం అనడం మానేయాలి. సీఎంను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. నాకు కూడా గతంలో సీఎం అవకాశం వచ్చిపోయింది. ముందు ఎన్నికల్లో గెలవండి. తర్వాత సీఎం పంచాయితీ’ అని కామారెడ్డిలో సీనియర్‌ నేత హన్మంత రావు చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా పార్టీ నేతలంతా పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా అంతిమంగా అంతా ఒక్కతాటిపైనే ఉన్నామనే సంకేతాలు వెళితేనే పార్టీ గెలుస్తుందని ద్వితీయ శ్రేణి నాయకత్వం చెబుతున్నది. సీఎం సీటు కోసం పోటీ పడుతున్నవారు గెలుస్తారన్న వాస్తవాన్ని గ్రహించాలని, ముందు పార్టీ గెలిస్తే.. అప్పుడు సీఎం కావడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందని అంటున్నారు.