పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాలమూరులో ‘రాజకీయ’ యాత్రలు

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పెట్టుకున్న పార్టీల నేతలు ప్రజలను ఆక‌ర్ఫించే పనిలో పడ్డారు. ఇందుకు పాదయాత్ర అనే అస్త్రాన్ని ఎంచుకున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాలమూరులో ‘రాజకీయ’ యాత్రలు
  • న్యాయయాత్ర పేరుతో కాంగ్రెస్ నేత వంశీ
  • విజయ సంకల్ప యాత్రతో బీజేపీ నేత కిషన్ రెడ్డి
  • రెండు పార్టీల యాత్ర‌లూ కృష్ణ మండ‌లం నుంచే

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పెట్టుకున్న పార్టీల నేతలు ప్రజలను ఆక‌ర్ఫించే పనిలో పడ్డారు. ఇందుకు పాదయాత్ర అనే అస్త్రాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేత, సీడ‌బ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి న్యాయయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. గత నెలలో మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం నుంచి ఈ యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతున్న‌ది. నారాయణ పేట, దేవరకద్ర, షాద్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాల్లో పాదయాత్రను పూర్తి చేశారు. మహబూబ్ నగర్, కొడంగల్‌లో ఈ యాత్ర చేపట్టాల్సి ఉంది. నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు దగ్గరుండి తెలుసుకుని, వాటిని తీర్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేపట్టానని వంశీ చెబుతున్నారు. ఈ లోక్‌స‌భ స్థానం ప‌రిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండ‌టంతో ఇక్కడ‌ కాంగ్రెస్ విజయం సాధిస్తుందనే భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినందుకు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ లోక్‌స‌భ స్థానం త‌న‌కు కేటాయిస్తుంద‌నే న‌మ్మ‌కంతో వంశీచంద్ రెడ్డి ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పాదయాత్రలో భాగస్వామ్యం చేయడంలో సఫల‌మ‌య్యారు. ఏడుగురు ఎమ్మెల్యేలు మద్దతుగా నిలువ‌డం త‌న విజ‌యానికి అవ‌కాశం ఇస్తుంద‌నే అభిప్రాయంతో ఆయ‌న కనిపిస్తున్నారు.

 

యాత్ర మొద‌లుపెట్టిన కిష‌న్‌రెడ్డి

కాంగ్రెస్‌కు దీటుగా బీజేపీ కూడా విజయ సంకల్ప యాత్ర ద్వారా పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రజలకు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌యత్నిస్తున్న‌ది. ఈ మేరకు మంగళవారం మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల కేంద్రంలోని దేవాలయంలో పూజల‌ అనంతరం కిషన్ రెడ్డి యాత్ర‌ ప్రారంభించారు. ఇక్కడి నుంచి మక్తల్, నారాయణ పేట నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేసి.. కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలను ప్ర‌జ‌ల‌కు కిష‌న్‌రెడ్డి వివ‌రిస్తారు. ఆయన వెంట బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ జాతీయ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, శాంతి కుమార్, పార్టీ శ్రేణులు ఉన్నారు. ఈ యాత్ర మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతుంది.

రెండు స్థానాల్లో గెలుపునకు బీజేపీ వ్యూహం :

విజయ సంకల్ప యాత్ర ద్వారా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించలేదు. మహబూబ్ నగర్ సీటుపై ముఖ్యంగా ముగ్గురు మధ్య టికెట్ వార్ నడుస్తోంది. ఎన్నడూ లేని బీసీ నినాదం కొత్తగా తెర పైకి వచ్చింది. బీజేపీ సీనియర్ నేత శాంతి కుమార్ బీసీ వర్గానికి చెందడంతో టికెట్ తనకే ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానంపై తీవ్ర వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీ క్యాడర్‌ను కలుస్తున్నారు. ఈ సారి టికెట్ తనకే వస్తుందని కార్యకర్తల సమావేశల్లో ప్రకటిస్తూ వస్తున్నారు. పార్టీలో ఉన్న బీసీ నేతలు కూడా ఆయనకే మద్దతుగా నిలిచారు. మరో వైపు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఈ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా మద్దతుగా ఉంటానని జితేందర్ రెడ్డి ప్రకటించారు. ఇద్దరే కాకుండా డీకే అరుణ సైతం ఈ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికీ ఆమె ఈ సెగ్మెంట్లో జరిగే ప్రతి సమావేశానికి హాజరవుతూ కార్యకర్తలతో మమేకమవుతున్నారు. బీజేపీ శ్రేణులు కూడా డీకే అరుణ పోటీలో ఉంటేనే గెలుపు గ్యారంటీ అని అంటున్నారు.చివరకు వీరి ముగ్గురిలో టికెట్ ఎవరికి దక్కుతుందో వేచిచూడాలి.

నాగర్ కర్నూల్ టికెట్ శృతికేనా?

నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి టికెట్ కోసం పోటీ పడే వారే క‌నిపించ‌డం లేదు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన బంగారు శృతి ఒక్కరే టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆమె అధిష్ఠానం వద్ద తన అభిప్రాయం తెలియజేశార‌ని స‌మాచారం. కానీ ఈ లోక్‌స‌భ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఉన్నారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా ప్రజలు మోడీపై నమ్మకంతో బీజేపీకి ఓట్లు వేస్తారనే ఆశ‌లో నేతలు ఉన్నారు.


పత్తాలేని బీఆర్ఎస్

మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఆ పార్టీకి చెందిన ఒక్క నేత కూడా ఈ స్థానాల్లో పోటీకి సిద్ధ‌ప‌డ‌టం లేద‌ని స‌మాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులకు ప్రజలు తిరస్కరించడంతో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేద‌ని చెబుతున్నారు. ముందుగా సిటింగ్‌ల‌ను మార్చాలని బీఆర్ఎస్ అధిష్ఠానం భావించినా.. కొత్త‌వారు పోటీ చేసేందుకు సిద్ధ‌ప‌డ‌క‌పోవ‌డంతో మళ్ళీ సిట్టింగ్‌ల‌కే అవకాశం ఇస్తార‌నే అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. అయితే.. సిటింగ్‌లు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదనే మాటలు వినిపిస్తుండ‌టంతో అధిష్ఠానం నేత‌లు త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ని తెలుస్తున్న‌ది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్ఎస్ పరిస్థితి పాతాళంలోకి పడిపోయింది. ఏది ఏమైనా ఈ రెండు స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు ప్రయత్నం చేస్తున్నాయి.ఇప్పటికీ పాదయాత్ర ల పేరుతో పార్లమెంట్ ఎన్నికలకు ఈ రెండు పార్టీ లు శంఖారావం పూరిస్తున్నాయి.