ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో అక్రమాలు.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు

విధాత: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఓటర్ల నమోదులో జ‌రుగుతున్న అవకతవకల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి బుధ‌వారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. అర్హుల‌కు మాత్ర‌మే ఓటు హ‌క్కు ల‌భించేలా చూడాల‌ని కోరారు. తెలంగాణ ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీసు వివరాలను ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం పరిశీలించకుండానే అధికారులు […]

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో అక్రమాలు.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు

విధాత: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఓటర్ల నమోదులో జ‌రుగుతున్న అవకతవకల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి బుధ‌వారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. అర్హుల‌కు మాత్ర‌మే ఓటు హ‌క్కు ల‌భించేలా చూడాల‌ని కోరారు.

తెలంగాణ ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సర్వీసు వివరాలను ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం పరిశీలించకుండానే అధికారులు కౌంటర్ సిగ్నేచర్ చేస్తున్నారని వారు ఆరోపించారు. కోవిడ్ అనంతరం నియ‌మితులైన జూనియర్ ఉపాధ్యాయులను (లోగడ ఏ విద్యాసంస్థలోనూ పనిచేసిన అనుభవం లేకున్నా) కేవలం మూడు నెలల పే స్లిప్స్ ఆధారంగా సర్వీస్ సర్టిఫికెట్లపై కౌంటర్ సిగ్నేచర్ చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాలకు భిన్నంగా రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన ఉత్తర్వులు బోగస్ ఓట్ల నమోదుకు అవకాశం కలిగిస్తుంద‌న్నారు. వెంట‌నే ఆ ఉత్తర్వులు రద్దు చేసి, డీఈఓ పై చర్య తీసుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ ఫిర్యాదు చేసింది.

కొందరు ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ ఎంలు ఇచ్చిన సర్వీస్ సర్టిఫికెట్ ఆధారంగా 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొందరు ఓటరుగా నమోదు అయ్యారని తెలిపారు. యూపీఎస్ ఉపాధ్యాయులు అర్హులా కాదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. దీని ద్వారా యూపీఎస్ లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదయ్యే వీలుంటుందని సీఈఓను కోరారు.

ఉన్నత విద్య, సాంకేతిక విద్య కళాశాలల ఉపాధ్యాయుల పేరిట కొందరు సర్వీసు సర్టిఫికెట్లపై డిజిగ్నేటెడ్ అధికారి (యూనివర్సిటీ రిజిస్ట్రార్) సంతకం లేకుండానే ఆన్ లైన్‌లో దరఖాస్తులు సమర్పించినట్లు తెలిసిందన్నారు. ఉపాధ్యాయ ఓటరు ద‌ఖాస్తులన్నింటినీ ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల క‌నుగుణంగా సమగ్రంగా పరిశీలించి అర్హుల‌నే ఓట‌ర్లుగా నమోదు చేయాలని కోరారు.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తులను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న ప్రచురించే డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్ట్‌లో ఓటరు పనిచేస్తున్న విద్యా సంస్థ పేరును స్పష్టంగా పేర్కొనాలని టీఎస్‌యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీఈఓను కోరారు. స్పందించిన సీఈఓ ఓటరు నమోదులో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని, అక్రమాలు జరిగినట్లు నిరూపిత‌మైతే సంబంధిత ఏఈఆర్ఓ లపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.