దేశవ్యాప్తంగా ప్రజాపాలన రావాలి
ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో విఫలమైన దొరల బీఆరెస్ సర్కార్..

- ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో విఫలమైన దొరల బీఆరెస్ సర్కార్
- చిట్టచివర ఉన్న జనం గొంతు వినాలి
- మహాత్ముడు చెప్పిన మాట ఇది
- తెలంగాణ కష్టాలు తొలగిపోతాయి
- కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్
- యూట్యూబ్‌లో వీడియో విడుదల
విధాత : దేశవ్యాప్తంగా తిరిగి ప్రజాపరిపాలన రావాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజల బాధలు తీర్చడంలో బీఆరెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన రాహుల్‌గాంధీ.. ఆత్మహత్య చేసుకున్న బాధితుడి నివాసానికి వెళ్లారు. దానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కనీస అవసరాలు తీర్చే ఉద్దేశంతోనే తాము ఆరు గ్యారెంటీలు ప్రకటించామని తెలిపారు. “చిట్టచివరన ఉన్నవారి గొంతు వినడమే అత్యంత ముఖ్యమైనదని మహాత్మాగాంధీ ఒక సందర్భంలో చెప్పారు. కుమ్మరి చంద్రయ్యది కూడా అలాంటి గొంతే. దొరల బీఆరెస్ ప్రభుత్వం వల్ల ఆయన నష్టపోయాడు. తెలంగాణలో ఆయనో చిన్న రైతు. రుణభారం నుంచి బయటపడేందుకు నానా అవస్థలు పడుతున్నాడు. తనకు అత్యంత ప్రియమైన కుటుంబాన్ని వదిలి, ఆత్మహత్య చేసుకున్నాడు” అని రాహుల్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
“తగిన సమయంలో ఆయనకు ప్రభుత్వ సహాయం అంది ఉంటే ఈ రోజు ఆయన తనకు ప్రీతిపాత్రమైన కుటుంబ సభ్యుల మధ్య జీవించి ఉండేవారు. బీఆరెస్, బీజేపీ వంటి దొరల ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయి” అని రాహుల్ విమర్శించారు. “ఈ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చగలదా? అవును.. మార్చగలదు. సందేహం లేదు” అని ఆయన చెప్పారు. చిట్టచివరన ఉన్న కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేవే కాంగ్రెస్ గ్యారెంటీలని తెలిపారు. తాము ఇంకా రుణభారంతో సతమతమవుతున్నామని కుమ్మరి తిరుపతమ్మ తనకు చెప్పారన్న రాహుల్‌గాంధీ.. ఈ పరిస్థితి అత్యంత త్వరలోనే మారబోతున్నదని పేర్కొన్నారు.
ప్రజలందరికీ న్యాయం అందాలనే తాము పోరాడుతున్నామని తెలిపారు. ప్రజలే కేంద్రంగా సాగే పరిపాలన దేశవ్యాప్తంగా మళ్లీ రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ వీడియోలో కుమ్మరి చంద్రయ్య కుటుంబ సభ్యులతో రాహుల్‌గాంధీ మాట్లాడి, వారి సమస్యలపై ఆరా తీయడం కనిపిస్తున్నది. వారి కుటుంబానికి ఉన్న భూమికి భూసార పరీక్షలు నిర్వహించేలా చూడాలని, చనిపోయిన రైతు భూమిని అతని భార్యపేరిట మార్చేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక కాంగ్రెస్ నేతలకు ఆయన నిర్దేశించారు.