హెయిర్ బ్యాండ్స్‌ అమ్ముతూ.. బ‌తుకు బండి లాగుతూ.. ఇదీ ప‌వ‌న్ ధీన‌గాథ‌!

హెయిర్ బ్యాండ్స్‌ అమ్ముతూ.. బ‌తుకు బండి లాగుతూ.. ఇదీ ప‌వ‌న్ ధీన‌గాథ‌!

కూటి కోసం కోటి క‌ష్టాలు అనేది నిజ‌మే. రెక్కాడితే డొక్కాడ‌ని చాలామంది నిరుపేద‌లు.. క‌డుపు నింపుకొనేందుకు చాలా క‌ష్టాలు ప‌డుతుంటారు. ఆ కుటుంబ పెద్ద‌లే కాదు.. పిల్ల‌లు కూడా ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతుంటారు. అలా అంద‌రూ సంపాదించిన దాంతో క‌డుపు నింపుకొంటుంటారు. ఓ గూడు ఏర్ప‌ర‌చుకుంటుంటారు.


అయితే ఓ అబ్బాయి కూడా త‌న కుటుంబానికి అండ‌గా నిల‌వాల‌నే ఉద్దేశంతో.. ఫుట్ పాత్‌పై హెయిర్ బ్యాండ్స్‌ అమ్ముతున్నాడు. హెయిర్ బ్యాండ్స్‌ అమ్మ‌డ‌మే కాదు.. త‌న చ‌దువును కూడా ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌డంలేదు. ఓ వైపు హోం వ‌ర్క్ చేసుకుంటూనే.. హెయిర్ బ్యాండ్స్‌ అమ్ముతున్నాడు. హృద‌యాల్ని పిండేసే ఈ దృశ్యాల‌ను ఢిల్లీకి చెందిన ఫొటోగ్రాఫ‌ర్ హ‌ర్రీ త‌న కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఆ అబ్బాయి హృద‌య‌విదార‌క స్టోరీ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోల‌ను 10 మిలియ‌న్ల మంది వీక్షించారు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని క‌మ‌లా న‌గ‌ర్ మార్కెట్ వ‌ద్ద ఆవిష్కృతం అయిన‌ట్లు హ‌ర్రీ పేర్కొన్నాడు.


ఈ సంద‌ర్భంగా ఆ పిల్లాడితో హ‌ర్రీ మాట క‌లిపాడు. త‌న పేరు ప‌వ‌న్ అని, ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ట్లు ఆ అబ్బాయి తెలిపాడు. నాన్న కోల్‌క‌తాలో ఉంటున్నాడ‌ని, అమ్మ ఇక్క‌డే ఇంటి వ‌ద్ద ఉంటున్న‌ట్లు చెప్పాడు. ఇంటి ద‌గ్గ‌ర చ‌దువుకొనేందుకు స‌మ‌యం దొర‌క‌దు. కాబ‌ట్టి కుటుంబానికి అండ‌గా నిల‌వాల‌నే ఉద్దేశంతో ఇక్క‌డ హెయిర్ బ్యాండ్స్‌ అమ్ముకొంటూ, చ‌దువుకుంటున్నాన‌ని ప‌వ‌న్ తెలిపాడు. త‌న చ‌దువును ఎక్క‌డా కూడా నిర్ల‌క్ష్యం చేయ‌ట్లేద‌ని చెప్పాడు.


ప‌వ‌న్ స్టోరీ విన్న త‌ర్వాత‌, ఆ వీడియోల‌ను చూసిన త‌ర్వాత ఓ యూజ‌ర్ ఇలా స్పందించాడు. ‘ఈ వీడియోను చూసిన త‌ర్వాత చాలా బాధ‌ప‌డ్డాను. నా చ‌దువుల కోసం మా అమ్మ‌, నాన్న ఎంతో క‌ష్ట‌ప‌డి, అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తున్నారు. ఈ విష‌యంలో నేను ఎంతో అదృష్ట‌వంతుడిని. కానీ ప‌వ‌న్‌కు అలాంటి స‌దుపాయాలు లేన‌ప్ప‌టికీ, కుటుంబానికి అండ‌గా ఉంటూ, ఫుట్‌పాత్‌పై చ‌దువుకోవ‌డం గొప్ప విష‌య‌ం’ అని ప్ర‌శంసించాడు. ప‌వ‌న్ ఏదో ఒక రోజు చ‌రిత్ర సృష్టిస్తాడ‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు.