Mamata Banerjee । కాంగ్రెస్ గెలువొద్దని దీదీ కోరుకుంటున్నారా!
నితీశ్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లక్ష్యం బీజేపీని గద్దె దించడమే కాదు, ఇండియా కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమలో ఒకరికి ప్రధాని పదవి..

40 సీట్లు కూడా రావనడం వెనుక మర్మమేమిటి?
రాష్ట్రాల్లో తామే గెలవాలి.. కేంద్రంలో కీలక పాత్ర ఉండాలి
కేజ్రీ ఉద్దేశం కూడా అదేనా?
(విధాత ప్రత్యేకం)
ఇండియా కూటమి విభేదించి ఎన్డీఏతో జట్టు కట్టిన బీహార్ నితీశ్ కుమార్ తన నిర్ణయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఇక తాను ఎప్పటికీ ఎన్డీఏలోనే కొనసాగుతానని అని కూడా అన్నారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉండి లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న ఆప్, టీఎంసీలలో టీఎంసీ గతంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యపార్టీ. మమతా బెనర్జీ కూడా వాజపేయ్ హయంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. బెంగాల్లో సీపీఎం దూరంగా తన ప్రతిపాదనలకు అనుగుణంగానే కాంగ్రెస్‌పార్టీ వ్యవహరించాలన్నది మమతా బెనర్జీ భావన. ఇదే విషయాన్ని ఆమె ఇండియా కూటమి భేటీలోనూ చెప్పారు. బెంగాల్ బాధ్యతలు తనకే అప్పగించాలన్నారు. బెంగాల్లో ఉన్న 42 స్థానాల్లో కాంగ్రెస్‌కు 2 సీట్లు మాత్రమే ఇస్తామని ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్‌పార్టీ అంగీకరించనందున తాము ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నది. కానీ తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు చూస్తే నితీశ్‌కుమార్ బైట పడ్డారు. వీళ్లు పడలేదు అన్నట్టే ఉన్నది. ఎందుకంటే మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా గెలువడం అనుమానమే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉంటే యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించాలని సవాల్ విసిరారు. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు ఇస్తామని ప్రతిపాదించానని, కానీ ఎక్కువ సీట్లు కావాలని ఆ పార్టీ కోరడం వల్లనే పొత్తు కుదరలేదన్నారు. ఎన్నికల అనంతరం భావసారూప్యత కలిగిన పార్టీలతో చర్చించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
గత ఎన్నికల ఫలితాల ఆధారంగానే
2019 లోక్‌సభ ఎన్నికల్లో 43.28 శాతం ఓట్లతో టీఎంసీ 22 స్థానాలు గెలిచింది. అదేసమయంలో బీజేపీ 40.25 శాతం ఓట్లతో 18 సీట్లను చేజిక్కించుకున్నది. కాంగ్రెస్‌పార్టీ 5.61 శాతం ఓట్లతో 2 సీట్లను మాత్రమే దక్కించుకున్నది. సీపీఎంకు 6.28% ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేపోయింది. గత ఎన్నికల ఫలితాల ఆధారంగానే బెంగాల్ సీట్ల ప్రతిపాదన చేశానని దీదీ చెబుతున్నారు. మమతా బెనర్జీ ప్రతిపాదనను అంగీకరించవద్దని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అధిష్ఠానానికి చెప్పింది. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నేత అధీర్ రంజన్ మమతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ రెండు పార్టీల మధ్య విభేదాలకు ఒక కారణం మాత్రమే. కానీ భాగస్వామ్యపార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే కూటమి బలపడుతుందనే వాస్తవాన్ని ఆమె విస్మరించారు. బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లోనే ఆ పార్టీ ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని మమతా బెనర్జీ ప్రతిపాదన. ప్రాంతీయపార్టీలు అధికారంలో ఉన్నచోట లేదా బలంగా ఉన్నచోట కాంగ్రెస్‌పార్టీ రాజీ పడాలన్నది దీని సారాంశం.
మాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు
అయితే నితీశ్‌కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ల లక్ష్యం బీజేపీని గద్దె దించిడమే కాదు, ఇండియా కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే భాగస్వామ్య పార్టీలైన తమలో ఒకరికి ప్రధాని పదవి అప్పగించాలన్నది వాళ్ల కోరిక. అందుకే కాంగ్రెస్ పార్టీ వీలైంత ఎక్కువ సీట్లు గెలువకూడదన్నదని ఆ ముగ్గురి ఆలోచన అయి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అందుకే పంజాబ్‌లో ఆప్, బెంగాల్ లో టీఎంసీ కాంగ్రెస్ కు అతి తక్కువ సీట్లను మాత్రమే ఆఫర్ చేశాయి. దీనికి ఎట్లాగూ ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నాయకత్వమే కాదు కేంద్ర నాయకత్వం కూడా అంగీకరించదని తెలుసు. దీన్ని కారణంగా చూపెట్టి ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. వీళ్ల వ్యవహారం చూస్తుంటే ఆయా రాష్ట్రాల్లో తమ అధికారానికి ఢోకా ఉండకూడదు. కేంద్రంలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడకూడదన్నట్టు ఉన్నది. అందుకే తాజాగా కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలువడం అనుమానమే అనడం వెనుక నైతికంగా ఇండియా కూటమిని దెబ్బతీసే ప్రయత్నంగానే చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణలో అధికారంలో ఉన్నది. జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికార ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నది. బీహార్ మహాఘట్బంధన్, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉన్నది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో బలంగా ఉన్నది. ఇవన్నీ తెలిసి కూడా 40 సీట్లు కూడా గెలవడం అనుమానమే అని మమతా బెనర్జీ అనడం వెనుక ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు.