సరిహద్దుల్లో పదివేల మంది సైన్యం మోహరింపు.. ఎందుకంటే..
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. చైనా సరిహద్దుల్లో భారీగా భారత సైన్యాన్ని మోహరించడం కొత్త చర్చలకు తావిస్తున్నది

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. చైనా సరిహద్దుల్లో భారీగా భారత సైన్యాన్ని మోహరించడం కొత్త చర్చలకు తావిస్తున్నది. చైనాతో వివాదాస్పద సరిహద్దు వద్ద భద్రతను పటిష్టం చేసే వ్యూహంలో భాగంగా మోహరింపును చెబుతున్నారు. మోహరింపుపై అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ.. ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు గల చైనా సరిహద్దుల్లో ఈ సైనికులను మోహరించారని తెలుస్తున్నది. భారత్, చైనా సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో ఇప్పటికే 9,000 మంది సైనికులు ఉన్నారు. 532 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుకు ఇప్పుడు బలగాలను తరలించడం వెనుక వ్యూహం ఏమిటన్న చర్చ నడుస్తున్నది. 2020లో చైనాతో జరిగిన ఘర్షణల్లో కనీసం 20 మంది భారతీయ సైనికులు వీర మరణం పొందారు. పెద్ద సంఖ్యలో చైనా సైనికులు చనిపోయారని, కానీ ఆ సంఖ్యను ఆ దేశం బయటపెట్టలేదని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన తర్వాత 2021లో చైనాతోగల సరిహద్దులో గస్తీ కోసం భారత్ అదనంగా 50 వేల మంది సైనికులను మోహరించింది. 2020లో ఎదుర్కొన్న పరిస్థితిని మనం మళ్ళీ ఎదుర్కొనే అవకాశం ఉందని, అందుకే అన్నివేళలా అప్రమత్తంగా ఉంటామని ఇటీవల భారత రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమణి చెప్పారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైనికుల్లో మనోధైర్యాన్ని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు.