చైనాలో ఉయిఘర్ ప్రొఫెసర్‌కు యావజ్జీవం

- నిర్ధారించిన ఉన్నత న్యాయస్థానం
బీజింగ్: తనకు 2028లో విధించిన యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేయాలని కోరుతూ ప్రముఖ ఉయిఘర్ మహిళా ప్రొఫెసర్ రాహిల్ దాహూత్ (57) దాఖలు చేసుకున్న పిటిషన్‌ను చైనాలోని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అమెరికాకు సంబంధించిన డ్యూహై హ్యవా ఫౌండేషన్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపింది.
రాహిల్ దాహూత్.. సిన్ సియాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె మైనార్టీ జాతుల సంస్కృతి, సంప్రదాయాలు, కళల పరిశోధన కేంద్రం వ్యవస్థాపకురాలు కూడా. ఆమె తయారు చేసిన ఇస్లాం మత బోధనల సైట్స్ ప్రపంచంలో బాగా ప్రసిధ్ధి చెందాయి. అనేక గ్రంథాలను కూడా ఆమె రచించారు. వేరువేరు యూనివర్సిటీలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈమె వల్ల దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు అని చైనా ప్రభుత్వం ఆరోపిస్తున్నది.
అయితే వివిధ హక్కుల సంఘాలు మాత్రం ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్నాయి. ఆమెకు యావజ్జీవ కారాగారం విధించడం అత్యంత ఘోరమని, బాధాకరమని పేర్కొంటున్నాయి. ఉయిఘర్ జాతికి ఇదో పెద్ద దెబ్బ అని అంటున్నాయి. అంతేకాదు స్వేఛ్ఛను కోరుకొనే ఉయిఘర్ మేథావులకు ప్రభుత్వం తరపునుండి చేసే హెచ్చరిక అని వారు వాపోతున్నరు.
ఉయిఘర్ జాతి ముస్లింలు చైనా వాయవ్య ప్రాంతంలోవున్న సిన్ సియాంగ్ రీజియన్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఎన్నో ఏండ్ల నుంచి పోరాడుతున్నారు. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉయిఘర్ ప్రజలపైన బీజింగ్ ప్రభుత్వం అమానుషమైన దారుణాలకు పూనుకొంటున్నదనే ఆరోపణలు ఉన్నాయి. మానవత్వాన్ని మంటగలిపేలా ఉయిఘర్‌లపట్ల గత కొన్ని దశాబ్దాలుగా ప్రవర్తిస్తున్నదని హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే 2017 డిసెంబర్‌లో చైనా ప్రభుత్వం చేపట్టిన ఒక క్యాంపెయిన్‌లో ఫ్రొఫెసర్ దాహూత్ మాయమయ్యారు.