మహారాష్ట్ర ఎన్డీయేలో లుకలుకలు

అన్ని పార్టీల్లో చిక్కులు పెట్టే బీజేపీకి సొంత పార్టీలోనూ, సొంత కూటమిలోనూ చిక్కులు ఎదురవుతున్నాయి

మహారాష్ట్ర ఎన్డీయేలో లుకలుకలు
  • బీజేపీలోనూ టికెట్ల పంచాయితీ
  • నేడు ముంబైకి హోం మంత్రి అమిత్‌షా

ముంబై : అన్ని పార్టీల్లో చిక్కులు పెట్టే బీజేపీకి సొంత పార్టీలోనూ, సొంత కూటమిలోనూ చిక్కులు ఎదురవుతున్నాయి. మహారాష్ట్ర ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుబాటులో సమస్యలు, సొంత పార్టీలో టికెట్ల పంచాయితీ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాల్లో భాగస్వామ్య పార్టీలు, సొంత పార్టీలో భేదాభిప్రాయాలు తలెత్తినట్టు సమాచారం.

ఇటీవల 195 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ విడుదల చేసినా.. అందులో మహారాష్ట్ర నుంచి ఒక్క స్థానం కూడా లేకపోవడం గమనార్హం. పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు అమిత్‌షా వస్తున్నారని పార్టీ చెబుతున్నా.. భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు సమస్యలు, సొంత పార్టీలో టికెట్ల పంచాయితీని తేల్చేందుకు వస్తున్నారని పార్టీలో విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. పార్టీలో కొన్ని సీట్లపై సమస్యలు ఉన్నాయని, అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముందే వీటిని పరిష్కరించాల్సి ఉన్నదని బీజేపీ నేత ఒకరు చెప్పారు. అమిత్‌షా పర్యటన వీటిని పరిష్కరిస్తుందన్నారు. విదర్భలోని అకోలాలో అమిత్‌షా సమావేశం నిర్వహించనున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాంకులే చెప్పారు. ఈ ప్రాంతంలోని అకోలా, బుల్ధానా, అమరావతి, చంద్రాపూర్‌, వార్ధాలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంచాయతీ నడుస్తున్నదని సమాచారం.

అమరావతి నుంచి స్వతంత్ర ఎంపీ నవనీత్‌ రాణా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సీటు విషయంలో భాగస్వామ్య పక్షాల మధ్య పంచాయతీ నెలకొన్నదని తెలుస్తున్నది. ఇక్కడి నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసేందుకు నవనీత్‌ రాణా అంగీకరించినప్పటికీ.. ఆమె తప్పుడు మార్గాల్లో ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని పొందారన్న కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నది. పైపెచ్చు.. ఈ సీటుతోపాటు బుల్ధానా సీటును కూడా తమకే కేటాయించాలని షిండే సేన పట్టుబడుతున్నది.

చంద్రాపూర్‌లో అభ్యర్థి ఎంపికలో బీజేపీకి సమస్యలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక్కడి నుంచి బీసీ వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి సుధీర్‌ ముంగతివార్‌ను బరిలో దింపాలని బీజేపీ ఆలోచిస్తున్నది. కానీ.. కొందరు పార్టీ నేతలు మాత్రం ఇక్కడ ఆధిపత్య సామాజిక వర్గమైన కున్బి కులానికి చెందిన వ్యక్తిని పోటీకి దింపితే ఫలితం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

విధర్భలో మొత్తం పది సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం 48 స్థానాల్లో 45 సీట్లు గెలవాలన్న టార్గెట్‌ చేరుకోవడానికి ఈ సీట్లు చాలా కీలకం. 2029 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఐదు సీట్లను బీజేపీ గెలుచుకోగా, ఉమ్మడి శివసేన మూడింట గెలిచింది.

ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్‌, రావెర్‌, దిండోరి, నాసిక్‌, ధులే, నందుర్బర్‌, శిర్డి, అహ్మద్‌నగర్‌ ఉన్నాయి. ఇక్కడ కూడా అధికార కూటమి సమస్యలు ఎదుర్కొంటున్నది. భాగస్వామ్య పక్షం రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథ్వాలే) ఎస్సీ రిజర్వుడ్‌ అయిన శిర్డి సీటుపై కన్నేసింది. 2019లో ఈ ప్రాంతంలో బీజేపీ ఆరు, సేన రెండు స్థానాలు గెలిచాయి.

మరాఠ్వాడాలో ప్రస్తుతం కొనసాగుతున్న మరాఠా కోటా ఉద్యమం అంశం ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ శంభాజీ నగర్‌ సీటుపై (గతంలో ఔరంగాబాద్‌) బీజేపీ, షిండే సేన రెండు పట్టుపట్టుతున్నాయి. 2019లో ఇక్కడ ఎంఐఎం గెలిచింది.

కొంకణ్‌ ప్రాంతంలోనూ బీజేపీ, షిండే సేన సింధుదుర్గ్‌- రత్నగిరి సీటుపై పట్టుదలతో ఉన్నాయి. ఇది తమదేనని, మళ్లీ తామే పోటీ చేస్తామని బీజేపీ చెబుతున్నది. పశ్చిమ మహారాష్ట్రలోనూ బీజేపీ, అజిత్‌పవార్‌ ఎన్సీపీ మధ్య సీట్ల పంచాయితీ కనిపిస్తున్నది. ఎన్సీపీలో చీలిక అనంతరం శరద్‌పవార్‌ పక్షాన నిలిచిన అమోల్‌ కొల్మే ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎవరూ తగ్గడం లేదు. గతంలో తాము 22 సీట్లకు పోటీ చేశామని, ఇప్పుడు ఎందుకు తగ్గాలని షిండే సేన నాయకుడు గజానన్‌ కీర్తికార్‌ అన్నారు. షిండే సేనతో సమానంగా తమకూ సీట్లు ఇవ్వాలని అజిత్‌ వర్గం పట్టుబడుతున్నది. మరి ఈ పంచాయతీని అమిత్‌షా ఒక్క రోజులో ఎంత మేరకు పరిష్కరించగలరో వేచి చూడాలి.