‘కంచర్ల’ చుట్టూ బిగుస్తున్న అసమ్మతి ఉచ్చు!

తనకే సీఎం కేసీఆర్ టికెట్ ఇస్తారన్న కంచర్ల ధీమా.. చాడ, చకిలంల వ్యూహాలు ఫలించేనా.. పిల్లి.. గుత్తా వదిలిన బాణమా ! విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి పోటీగా వచ్చే ఎన్నికల్లో టికెట్ కోరుతున్న ఆశావాహులు సాగిస్తున్న రాజకీయాలు జిల్లాలో నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఉమ్మడి నలగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా నల్గొండ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల పరిస్థితి […]

‘కంచర్ల’ చుట్టూ బిగుస్తున్న అసమ్మతి ఉచ్చు!
  • తనకే సీఎం కేసీఆర్ టికెట్ ఇస్తారన్న కంచర్ల ధీమా..
  • చాడ, చకిలంల వ్యూహాలు ఫలించేనా..
  • పిల్లి.. గుత్తా వదిలిన బాణమా !

విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి పోటీగా వచ్చే ఎన్నికల్లో టికెట్ కోరుతున్న ఆశావాహులు సాగిస్తున్న రాజకీయాలు జిల్లాలో నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఉమ్మడి నలగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా నల్గొండ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల పరిస్థితి పద్మవ్యూహంలోని అభిమన్యుడు తీరులా తయారయింది.

ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఇక్కడి నుండే పోటీ చేస్తానంటూ ప్రకటించి ఆసక్తికర పోటీకి తెర లేపారు. గత ఎన్నికల్లో కంచర్ల మీద ఓడిన సానుభూతితో పాటు కేసీఆర్ ప్రభుత్వం పైన, సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల పైన నెలకొన్న తీవ్రమైన వ్యతిరేకత, గతంలో తను నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలు ఈసారి గెలిపిస్తాయని వెంకట్‌రెడ్డి నమ్ముతున్నారు.

కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న దుబ్బాక నరసింహరెడ్డి టికెట్ దొరికితే ఎన్నికల బరిలోకి దిగేందుకు రిజర్వ్ బెంచ్‌లో సిద్ధంగా ఉన్నారు. అటు బీజేపీ నుంచి బీసీ నేత మాదగోని శ్రీనివాసగౌడ్, నూకల నరసింహారెడ్డిలకు తోడు కొత్తగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పేరు టికెట్ రేసులో తెరపైకి వచ్చింది. వీరికి తోడు బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి టికెట్ ఆశిస్తున్న అసమ్మతివాదులపై కూడా కమల దళం కన్నేసి ఉంచింది.

నల్లగొండ BRSలో ఇంటి పోరు.. పోటీ పబ్లిసిటీలు

టికెట్ పై కంచర్ల ధీమా.. ఆగని సొంత పార్టీ నేతల ప్రయత్నాలు

సిట్టింగ్ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లోను తనకే సీఎం కేసీఆర్ టికెట్ ఇస్తారన్న ధీమాతో నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. సొంత పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న వారు సేవా కార్యక్రమాలతో, ఆత్మీయ సమ్మేళనాలతో తనకు వ్యతిరేకంగా హడావిడి చేస్తుండగా, వారిని విభజించి పాలించే వ్యూహంతో బలహీనం చేసే ఎత్తుగడలు వేస్తున్నారు.

సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో కంచర్లను గెలిపిస్తే నలగొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానంటూ ఇచ్చిన హామీ మేరకు ఈ నియోజకవర్గంలో 500 కోట్లు వెచ్చిస్తూ, నల్గొండ పట్టణ రూపురేఖలు మార్చే రీతిలో అభివృద్ధి పనులు జరిపిస్తున్నారు. ఆ పనులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయి అన్న ధీమా కంచర్లలో నెలకొంది.

వామ్మో.. పిల్లి గర్జన: ఎమ్మెల్యే కంచర్లకు ధీటుగా.. భారీ కాన్వాయ్‌తో ఖమ్మంకు !

అయితే నలగొండలో జరుగుతున్న పనుల్ని నేరుగా సీఎం కేసీఆర్ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో జరిపిస్తుండడంతో క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనుల క్రెడిట్ అంతా ఎమ్మెల్యే కంటే వారికే ఎక్కువగా దక్కుతుందన్న ప్రచారం వినిపిస్తుంది. కంచర్లకు పోటీగా టికెట్ ఆశిస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కంచర్ల హయాంలో జరుగుతున్న అభివృద్ధి కంటే ప్రభుత్వ పథకాల్లో, నిధుల్లో, పార్టీలో దక్కుతున్న గౌరవం ఏమిటన్న దానిపై కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తినే అసమ్మతి అస్త్రాలుగా సంధిస్తున్నారు.

చకిలం అనిల్ కుమార్ ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంతో బాహాటంగానే తన అసమ్మతి గళం వినిపించి, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ లేదా సీఎం కేసీఆర్ చేసిన హామీ మేరకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ తన వైఖరిని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర నేత చాడ కిషన్ రెడ్డి సైతం తాజాగా కనగల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల వైఖరి పై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు.

తన ప్రచార పోస్టర్లపై ప్రైవేటు కోచింగ్ సంస్థల పోస్టర్లను అంటించడం వెనక కంచర్ల హస్తం ఉందంటూ ఆయన మండిపడుతున్నారు. 22 ఏళ్లుగా పార్టీ అధినేతకు విధేయుడిగా ఉంటూ వస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో నల్గొండ టికెట్ తప్పక వస్తుందని అనుచరుల్లో ఉత్సాహం నింపారు. ఆత్మీయ సమ్మేళనంలో టికెట్ పై చాడ ధీమా వెనుక మతలబు ఏమిటన్నది కంచర్లను టెన్షన్ పెడుతుంది.

టికెట్ రేసులో కంచర్లకు దీటుగా దూకుడుగా వెళ్తున్న పిల్లి రామరాజు నిత్యం సేవా కార్యక్రమాలతో పాటు అనారోగ్యానికి గురైన, చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి ఒక్కో కుటుంబానికి 10 నుంచి 20వేలు సాయం చేస్తూ, సగటున రోజుకి 2 లక్షల మేరకు ఖర్చు చేస్తున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశమైంది.

నల్గొండ: BRSలో పోస్టర్ల రచ్చ.. కంచర్లపై చాడ వర్గం ఫైర్!

కంచర్లకు వ్యతిరేకంగా గుత్తా సుఖేందర్ రెడ్డి వదిలిన బాణం పిల్లి అన్న చర్చలు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి టికెట్ రేసులో పెద్దగా హడావిడి చేయక పోయినప్పటికి, అందరివాడిగా టికెట్ రేసులో తన పేరు పరిశీలనకు ఉండటం ఖాయమన్న ధీమాతో ఉన్నారు.

మరోవైపు తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని నలగొండ బరిలో దించేందుకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నియోజకవర్గ రాజకీయాల్లో కంచర్లకు చెక్ పెట్టేలా పక్కా వ్యూహాలను అమలు చేస్తూ అమిత్ ను నిత్యం ప్రజల్లో ఉండేలా గుత్తా ట్రస్టు సేవా కార్యక్రమాల నిర్వహణతో సందడి చేయిస్తున్నారు.

అమిత్ రెడ్డి తరచు ఏదో ఒక కార్యక్రమం పేరుతో నలగొండ టికెట్ రేసులో తన పేరు బలంగా వినిపించేలా ముందడుగు వేస్తున్నారు. అయితే అమిత్ రెడ్డికి నలగొండ టికెట్ సాధించే క్రమంలో కంచర్లకు వ్యతిరేకంగా అసమ్మతి నాయకులను నడిపించే రిమోట్‌లా సుఖేందర్ రెడ్డి పనిచేస్తున్నారన్న ప్రచారం సైతం గులాబీ వర్గాల్లో వినిపిస్తుంది.

నల్లగొండ BRSలో కలకలం.. తెలంగాణ ఉద్యమకారులతో ‘చకిలం’ ఆత్మీయ సమ్మేళనం

అయితే కంచర్ల దుందుడుకు తనముతో తెచ్చి పెట్టుకున్న శత్రువులే ఆయనకు నష్టదాయకంగా మారుతారని కంచర్ల వ్యతిరేకులు చెబుతున్నారు. నల్గొండ సెగ్మెంట్లో పార్టీ టికెట్ కోసం పోటీగా తనచుట్టూ చతురంగబలాల మాదిరిగా నలువైపులా నలుగురు అసమ్మతి నేతలు చకిలం, చాడ, పిల్లి, అమిత్‌లు చేస్తున్న పోటీ రాజకీయాలను తిప్పికొట్టి కంచర్ల తన టికెట్‌ను పదిలం చేసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది.

ఆగని ‘పిల్లి’ గర్జన..! కళ్లెం వేసేందుకు కంచర్ల పట్టు!